Prakash Raj | దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు వైవిధ్యమైన సినిమాలతో మెప్పించిన నటుల్లో ప్రకాష్ రాజ్ ఒకరు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన సినీ ప్రయాణం అనేక మైలురాళ్లతో నిండింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో పాటు హిందీ చిత్రాల్లోనూ ఆయన తన నటనతో మెప్పించారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, సమాజంలో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తపరిచే వ్యక్తిత్వం కూడా ప్రకాష్ రాజ్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చింది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సినీ వర్గాల్లోనూ, సామాజిక వేదికలపైనా చర్చనీయాంశంగా మారాయి. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ‘కేరళ లిటరేచర్ ఫెస్టివల్’లో పాల్గొన్న ప్రకాష్ రాజ్, హిందీ చిత్ర పరిశ్రమ ప్రస్తుత పరిస్థితిపై తీవ్ర స్థాయిలో స్పందించారు.
బాలీవుడ్ తన మూలాలను క్రమంగా కోల్పోతుందని, కథల్లో ఉండాల్సిన ఆత్మను పక్కన పెట్టేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బయటకు ఎంతో అందంగా, రంగురంగులుగా కనిపిస్తున్న సినిమాలు లోపల మాత్రం ప్రాణం లేని ఖాళీగా మారుతున్నాయనే ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలీవుడ్ సినిమాలను ‘మేడమ్ టుస్సాడ్స్’ మ్యూజియంలోని మైనపు విగ్రహాలతో పోల్చడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో జీవం ఉండదన్న భావనను ఈ పోలిక ద్వారా స్పష్టంగా చెప్పారు.మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిన తర్వాత హిందీ సినిమాలు కథల కంటే లగ్జరీ లుక్స్, భారీ ప్రమోషన్లు, ఖరీదైన రీల్స్, డబ్బు చుట్టూనే తిరుగుతున్నాయని ప్రకాష్ రాజ్ విమర్శించారు.
సామాన్య ప్రేక్షకుడితో అనుసంధానం కోల్పోవడమే బాలీవుడ్ ఎదుర్కొంటున్న అసలు సమస్య అని అభిప్రాయపడ్డారు. కథ చెప్పే సినిమాల స్థానంలో హంగులు, ఆర్భాటాలకే ప్రాధాన్యం పెరగడం వల్ల ప్రేక్షకులు దూరమవుతున్నారని ఆయన స్పష్టం చేశారు.ఇదే సమయంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను ప్రకాష్ రాజ్ ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా తమిళ, మలయాళ దర్శకులు తమ వేర్లను మరిచిపోకుండా, మట్టికథలను, సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలను, దళితుల వేదనను ఎంతో సహజంగా వెండితెరపై చూపిస్తున్నారని కొనియాడారు. “మన వేర్లు మన కథల్లో ఉండాలి. గ్లామర్ వెంటే పరుగెత్తడమే లక్ష్యంగా పెట్టుకుంటే సినిమాలు ప్రజలకు దూరమవుతాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ‘జై భీమ్’, ‘మామన్నన్’ వంటి చిత్రాలు సమాజంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో తెరకెక్కితే, బాలీవుడ్ మాత్రం ఇంకా కమర్షియల్ హంగులకే పరిమితమైందని ఆయన విమర్శించారు.