జాతీయ అవార్డులపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో జ్యూరీ సభ్యులు రాజకీయ ఒత్తిళ్లతో రాజీపడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం 55వ కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘భ్రమయుగం’ చిత్రానికిగాను సీనియర్ నటుడు మమ్ముట్టి ఉత్తమ నటుడిగా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఏర్పాటు చేసిన కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీకి ఛైర్మన్‌గా ఉన్నారు ప్రకాష్‌రాజ్. అవార్డుల ప్రకటన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాతీయ అవార్డుల గురించి ఆయన మాట్లాడారు. వాటిలో పారదర్శకత లోపించిందన్నారు.
‘జాతీయ అవార్డులను రాజీపడి ఇస్తున్నారని చెప్పడానికి నేను భయపడను. కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ చైర్‌పర్సన్‌గా ఉండటం చాలా ఆనందంగా ఉంది. ఈ బాధ్యతను అప్పగించే ముందు కేరళ కమిటీ వాళ్లు నాకు ఫోన్ చేసి‘అనుభవజ్ఞులైన బయటి వ్యక్తులు కమిటీకి నేతృత్వం వహించాలని మేము భావిస్తున్నాం. మేం అవార్డుల విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకోము’ అని చెప్పారు. అవార్డుల పట్ల వారి నిజాయితీ నన్ను ఆకట్టుకుంది. అందుకే ఈ బాధ్యత స్వీకరించా. అయితే జాతీయ అవార్డుల విషయంలో మాత్రం ఇలా జరగడం లేదు. కమిటీ పక్షపాతం కారణంగా యోగ్యతలేని వాళ్లను అవార్డులు వరిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వం, జ్యూరీ అవార్డులను శాసిస్తున్నప్పుడు మమ్ముట్టిలాంటి గొప్ప నటులకు జాతీయ అవార్డులు అవసరం లేదనిపిస్తున్నది’ అని ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు.
ఆయన కామెంట్స్ దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి ఇప్పటికి మూడుసార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. గత కొన్నేళ్లుగా జాతీయ అవార్డుల విషయంలో ఆయన్ని ఉద్దేశ్యపూర్వకంగా పక్కనపెడుతున్నారని, గొప్ప చిత్రాల్లో నటించినప్పటికీ అవార్డులను నిరాకరిస్తున్నారని మమ్ముట్టి అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.