Prakash Raj | ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి. ఇటీవల తన తల్లి స్వర్ణలత మరణించిన నేపథ్యంలో ఆమె జీవిత ప్రయాణం, కుటుంబ నేపథ్యం గురించి ఆయన పంచుకున్న విషయాలు పలువురిని ఆలోచింపజేస్తున్నాయి. ముఖ్యంగా నాకే కాదు.. మా అమ్మకు కూడా తమ జాతి, కులం ఏంటో తెలియదు అని ఆయన చెప్పిన మాటలు వైరల్గా మారాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, తనను ఎవరైనా పరిచయం అడిగితే ముందుగా నేను మనిషిని అని చెప్పుకుంటానన్నారు. నటన నా వృత్తి. చదవడం, రాయడం నా అభిరుచి. చిన్నప్పటి నుంచే సమాజంలో జరిగే విషయాలపై స్పందించే స్వభావం ఉంది. నాకు కులం, మతం అనే భావనలు లేవు అని తెలిపారు.
తన తల్లి స్వర్ణలత చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని ప్రకాష్ రాజ్ వివరించారు.1960 ప్రాంతంలో మా అమ్మానాన్న బెంగళూరుకు వలస వచ్చారు. మా అమ్మకు 12 ఏళ్ల వయసులోనే తల్లి మరణించారు. ఆ తర్వాత తండ్రి కూడా దూరమయ్యారు. ఆమెతో పాటు నలుగురు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. అనాథాశ్రమంలో పెరిగిన మా అమ్మను ఎంతోమంది ఆదుకున్నారు. కష్టపడి నర్సింగ్ శిక్షణ పూర్తి చేసింది. వాళ్లకు తమ జాతి, కులం, బంధువులు ఎవరో కూడా తెలియదు. తర్వాత క్రిస్టియన్ మిషనరీలో చేరి క్రైస్తవ మతాన్ని స్వీకరించింది అని వెల్లడించారు. ఇటీవల వయోభారంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా స్వర్ణలత కన్నుమూశారు. ఆమె చివరి కోరికను గౌరవిస్తూ బెంగళూరులోని సెయింట్ మైఖేల్ చర్చిలో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించినట్లు ప్రకాష్ రాజ్ తెలిపారు.
ప్రకాష్ రాజ్ గతంలో తాను నాస్తికుడినని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో తల్లి అంత్యక్రియలను మతపరమైన సంప్రదాయంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నలు లేవనెత్తారు. ఒక నెటిజన్ ఆయన పాత వీడియోతో పాటు తల్లి అంత్యక్రియల వీడియోను జత చేస్తూ విమర్శించగా, ప్రకాష్ రాజ్ స్పష్టంగా స్పందించారు. అవును… నాకు దేవుడిపై నమ్మకం లేదు. కానీ మా అమ్మకు తన దేవుడిపై విశ్వాసం ఉంది. ఆమె నమ్మకాన్ని గౌరవించడం నా బాధ్యత. ఆమె విశ్వాసం ప్రకారం అంత్యక్రియలు జరగాల్సిన హక్కును నేను ఎలా నిరాకరిస్తాను? ఒకరి నమ్మకాన్ని మరొకరు గౌరవించుకోవడం అంటే ఇదే. ద్వేషంతో చూసేవారికి ఈ విషయం అర్థం కాకపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు.