ప్రస్తుతం టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హంగామా నడుస్తుంది. మా అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ఉండగా వీరికి పలువురు సినీ పెద్దలు సపోర్టింగ్‌గా ఉన్నారు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం బరిలో దిగుతున్న మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబు తో కలిసి ఇప్పటికే సినీ పెద్దలని కలిసి వారి మద్దతు కోరారు. కృష్ణ , కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి వారు మంచు విష్ణుకి సపోర్ట్‌గా నిలిచినట్టు తెలుస్తుండగా, మరోవైపు ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ లభించింది
మంచు విష్ణుకి చెక్ పెట్టేందుకు నాగబాబు.. ప్రకాశ్ రాజ్‌తో ఉన్న పాత వైరాన్ని మరచిపోయి ఆయనకు తన సపోర్ట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో మంచు విష్ణుతో పాటు ఆ ప్యానెల్ సభ్యులు కొందరిని కూడా విమర్శించారు. అయితే గతంలో ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరిని ఉద్దేశిస్తూ ఊసరవెల్లితో పోల్చాడు. దీనికి నాగబాబు.. విమర్శించడం తప్ప మంచి చేస్తే మెచ్చుకోలేని నీ కుసంస్కారం గురించి ఏం చెప్పగలం.
నిర్మాతలని డబ్బు కోసం ఎన్ని రకాలుగా హింస పెట్టావో.. డేట్స్ ఇచ్చి రద్దు చేసి ఎంత హింసకు గురిచేశావో అన్నీ గుర్తున్నాయి. ముందు నువ్వు మంచి మనిషిగా మారు. మీడియా అడిగింది కదాని ఒళ్లు పొంగి నీ పనికి మాలిన రాజకీయ డొల్లతనాన్ని బయట వేసుకోకు” అని నాగబాబు గత నవంబర్ లో ట్విట్టర్ వేదికగా ఓ నోట్ రిలీజ్ చేశారు.ఇప్పుడు ప్రకాశ్ రాజ్‌కి మా ఎన్నికలలో సపోర్ట్ చేస్తున్న క్రమంలో ఆ ట్వీట్స్ అన్నీ ఇప్పుడు డిలీట్ చేశారు.కాకపోతే అప్పటికే ఆ పాత ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీసిపెట్టుకున్న వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ చేసేస్తున్నారు.