Prakash Raj | బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా, దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు రాబడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రణవీర్ సింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ధర్ హై-వోల్టేజ్ మేకింగ్ ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. కేవలం 17 రోజుల్లోనే ఈ చిత్రం భారతదేశంలో రూ. 985.02 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్లో రూ. 385 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం గ్రాస్ వసూళ్లు రూ. 1,564.30 కోట్లకు చేరుకుని, రూ. 2000 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. ఇది రణవీర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలుస్తోంది.
ఈ సినిమా చుట్టూ రాజకీయ చర్చలు కూడా మొదలయ్యాయి. తాజాగా నరేంద్ర మోదీ ఓ బహిరంగ సభలో ‘ధురంధర్ 2’ గురించి ప్రస్తావిస్తూ, ఈ చిత్రంపై వస్తున్న ‘ప్రోపగాండా’ విమర్శలను ఖండించారు. గతంలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ సినిమాలపై వచ్చిన విమర్శలను గుర్తు చేస్తూ, నిజాలను అంగీకరించలేక కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. సినిమాలో 2016 నోట్ల రద్దు ఘటనకు సంబంధించిన నిజమైన ఫుటేజ్ ఉపయోగించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు..మోదీ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు.
మోదీ వీడియోను షేర్ చేస్తూ, “సొంతంగా నిర్మించిన సినిమాలను ‘సెల్ఫ్ డబ్బా’గా ప్రమోట్ చేసుకోవడం కరెక్టేనా?” అంటూ ప్రశ్నించారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఒకవైపు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా, మరోవైపు రాజకీయంగా కూడా చర్చకు దారి తీస్తోంది. సినిమా కంటెంట్, వాస్తవ ఘటనల ప్రదర్శన, ప్రోపగాండా ఆరోపణలు అన్నీ కలిసి ‘ధురంధర్’ను కేవలం సినిమాగా కాకుండా ఓ డిబేట్ టాపిక్‌గా మార్చాయి. బాక్సాఫీస్ విజయంతో పాటు రాజకీయ చర్చల కేంద్రంగా మారిన ‘ధురంధర్: ది రివెంజ్’, ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా దూసుకుపోతున్న ఈ చిత్రం, వివాదాల మధ్య మరింత క్రేజ్ సంపాదించుకుంటోంది.