జైనీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రజాకవి కాళోజీ’. మూలవిరాట్, పద్మరాజ్ కుమార్, స్వప్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో విజయలక్ష్మీ జైనీ నిర్మించారు. త్వరలో విడుదల కానుంది. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ను ఇటీవల విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణ మూర్తి, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, దర్శకులు వి.ఎన్.ఆదిత్య, వేణు ఊడుగుల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆర్.నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ‘కాళోజీ తెలంగాణ కోసం జీవించారు. ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం’ అన్నారు. దర్శకుడు ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ ‘క్వాలిటీ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాలో పునరుజ్జీవం చెందుతున్న.. ఓ సజీవ చైతన్యంతో తొణికిసలాడుతున్న సమాజాన్ని చూపించాము’ అని చెప్పారు. తెలంగాణ పోరాట యోధుడు ప్రజాకవి కాళోజీ జీవిత చరిత్రను వెండితెర దృశ్యమానం చేసిన దర్శకుడు ప్రభాకర్ జైనీ అభినందనీయుడని మామిడి హరికృష్ణ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్.ఆత్రేయ, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ప్రభాకర్ జైనీ.