Pragathi | టాలీవుడ్లో హోమ్లీ పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న నటి ప్రగతి స్థాయి ఇప్పుడు మరింత పెరిగింది.అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంది.. తాజాగా జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో పాల్గొని ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకుంది.చాంపియన్‌షిప్ నుంచి భారత్‌కి తిరిగి వచ్చిన ప్రగతిని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఘనంగా స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ప్రగతి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ప్రగతి జాతీయ జెండా పట్టుకుని పూల వర్షంలో తడుస్తూ మెడలో పతకాలు వేసుకుని నర్తిస్తూ సంబరపడిపోయింది.
ఇక ప్రగతి వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. నా జీవితంలో నిజమైన విజయం అంటే… నన్ను ప్రేమించే వారు నా పట్ల గర్వపడటం. నా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇచ్చిన ఈ స్వాగతం… నా జీవితంలో మర్చిపోలేని రోజు అని రాసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ప్రగతి ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో సాధించిన విజయాలు చూస్తే.. డెడ్ లిఫ్ట్ – గోల్డ్ మెడల్, స్క్వాట్ – సిల్వర్ మెడల్, బెంచ్ ప్రెస్ – సిల్వర్ మెడల్, ఓవరాల్ సిల్వర్ మెడల్ ఇలా మొత్తం నాలుగు పతకాలు గెలుచుకుని, భారతదేశానికి గొప్ప పేరు తీసుకువచ్చింది.
సినిమాల్లో హోమ్లీ పాత్రలు పోషించిన ప్రగతి లోపల ఇంత శక్తివంతమైన అథ్లెట్ ఉన్నట్లు చాలామందికి తెలియదు. గత మూడు సంవత్సరాలుగా ఆమె క్రమంగా వెయిట్ లిఫ్టింగ్‌పై దృష్టి పెట్టి పలు పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్స్ సాధిస్తూ వస్తోంది. నెల్లూరు జిల్లా ఉలవపాడులో జన్మించిన ప్రగతి మొదట సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. తండ్రి మరణంతో కుటుంబం కోసం డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది. తర్వాత మోడలింగ్ చేసి, 1994లో తమిళంలో వీట్ల విశేషాంగా సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఆమె తెలుగు, తమిళం, మలయాళంలో తల్లి, అత్త, అక్క, వదిన వంటి పలు కీలక పాత్రల్లో నటించి అలరించింది.. మొత్తానికి ప్రగతి ఒక్క నటిగా మాత్రమే కాదు, పవర్ లిఫ్టింగ్‌లో కూడా దేశానికి నాలుగు పతకాలు తెచ్చి ఇండియాను మరోసారి గర్వపడేలా చేసింది. అభిమానులు కూడా ఆమెపై అభినందనల వర్షం కురిపిస్తూ, మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుతున్నారు.