Pragathi | టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నటి ప్రగతి మరోసారి వార్తల్లో నిలిచారు. నటిగా తల్లి, అత్త, కుటుంబ పాత్రల్లో సహజ నటనతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రగతి, ఇప్పుడు క్రీడా రంగంలోనూ తన సత్తా చాటుతున్నారు. వయస్సు అడ్డంకి కాదని నిరూపిస్తూ, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో సాధించిన విజయం అందరికీ ప్రేరణగా మారింది. నటనతో పాటు ఫిట్నెస్, క్రీడలపై ఆసక్తిని గట్టి సాధనగా మార్చుకున్న ప్రగతి, తాజాగా టర్కీలో నిర్వహించిన ఏషియన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఆమె ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలు సాధించి, మొత్తం నాలుగు మెడల్స్‌తో దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఒకప్పుడు వయస్సు, ఫిట్‌నెస్‌పై విమర్శలు చేసిన వారికి తన ప్రతిభతో సమాధానం చెప్పినట్టయ్యింది.
ఈ ఘన విజయం చుట్టూ తాజాగా అనూహ్యమైన వివాదం చోటుచేసుకుంది. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, ప్రగతి సాధించిన ఈ మెడల్స్ వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రగతి తన కెరీర్, రెజ్లింగ్‌లో ఎదగడం కోసం తన వద్ద పూజలు చేయించుకుందని, ఆ పూజల ఫలితంగానే ఆమెకు ఈ విజయాలు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలపై స్పందించిన ప్రగతి, గట్టి కౌంటర్ ఇచ్చారు. వేణుస్వామి వద్ద పూజలు చేయించుకున్న విషయం నిజమేనని, అయితే అది రెండున్నరేళ్ల క్రితం తాను మానసికంగా చాలా కష్టమైన దశలో ఉన్నప్పుడు మాత్రమే జరిగిందని వివరించారు. స్నేహితుల సూచనతోనే అప్పుడు అక్కడికి వెళ్లానని, టైమ్ బాగోలేనప్పుడు ఇలాంటి వాటిని నమ్మడం సహజమని చెప్పారు.
అయితే ఆ పూజల వల్ల తన జీవితంలో గానీ, క్రీడా ప్రయాణంలో గానీ ఎలాంటి ప్రత్యక్ష ఫలితం కనిపించలేదని ప్రగతి స్పష్టం చేశారు. అప్పుడెప్పుడో జరిగిన పూజలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇప్పుడు బయటపెట్టి, తన విజయానికి అవే కారణమన్నట్టు చెప్పుకోవడం సరికాదని ఆమె తప్పుబట్టారు. తన మెడల్స్ వెనుక అసలైన కారణం రాత్రింబవళ్లు చేసిన కష్టం, క్రమశిక్షణ, నిరంతర సాధన మాత్రమేనని ప్రగతి స్పష్టంగా చెప్పారు. తన విజయాన్ని ఇతరుల ఖాతాలో వేసుకోవడాన్ని వారి సంస్కారానికే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు. ప్రగతి చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు లభిస్తోంది. జిమ్‌లో చెమట చిందించి, శారీరకంగా, మానసికంగా పోరాడి సాధించిన విజయంలో జ్యోతిష్యాన్ని కలపడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది వేణుస్వామికి ప్రగతి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌గా టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.