నటీనటులు: ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, శరత్ కుమార్, రోహిణి తదితరులు.
సంగీతం: సాయి అభ్యంకర్
దర్శకత్వం: కీర్తిశ్వరన్
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్
విడుదల : అక్టోబర్ 17
‘లవ్ టుడే’తో యూత్‌ని ఆకట్టుకున్న తమిళ కథానాయకుడు ప్రదీప్ రంగనాథన్, ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజుతో కలిసి నటించిన తాజా చిత్రం ‘డ్యూడ్’. తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. పాటలు బ్లాక్‌బస్టర్ కావడంతో భారీ అంచనాల మధ్య ఈచిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ
మంత్రి ఆదికేశవులు (శరత్ కుమార్) కుమార్తె కుందన (మమితా బైజు). మేనత్త కుమారుడు గగన్ (ప్రదీప్ రంగనాథన్)ను చిన్నప్పటి నుంచే ప్రేమిస్తుంది. అయితే, గగన్ ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. లవ్ ఫెయిల్యూర్‌తో బెంగళూరు వెళ్లిపోతుంది కుందన. ఈ దూరం గగన్‌కు తన ప్రేమను అర్థమయ్యేలా చేస్తుంది. వెంటనే మామ (శరత్ కుమార్) దగ్గరకు వెళ్లి కుందనను పెళ్లి చేసుకుంటానని చెబుతాడు. ఆనందంగా ఒప్పుకున్న మంత్రి పెళ్లికి సిద్ధమవుతారు. అయితే, గగన్-కుందన పెళ్లికి అడ్డుపడిన సమస్య ఏమిటి? మధ్యలో కుందన ఎందుకు పెళ్లి వద్దని అంటుంది? గగన్ తల్లి (రోహిణి), కుందన తండ్రి (శరత్ కుమార్) మధ్య మాటలు ఎందుకు లేవు? చివరకు గగన్ చేసిన త్యాగం ఏంటి? అనేదే మిగతా కథ.
విశ్లేషణ:
‘డ్యూడ్’ సినిమా కథలో కొత్తదనం కోసం చూస్తే నిరాశే మిగులుతుంది. చిన్నప్పటి నుంచి ఉన్న ప్రేమ, బ్రేకప్, ఫ్యామిలీ ఎమోషన్స్, చివరకు పరువు హత్యల చుట్టూ కథ తిరుగుతుంది. ఇదివరకే చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలే కనిపిస్తాయి. అయితే, ఒక రొటీన్ కథను తెరపై ప్రేక్షకులు కొత్తగా ఫీలయ్యేలా చేయడంలో ఈ సినిమా విజయం సాధించింది. దీనికి ప్రధాన కారణాలు రెండు అందులో ఒకటి ప్రదీప్ రంగనాథన్ నటన మరియు సాయి అభ్యంకర్ సంగీతం.
నటీనటులు
గగన్ పాత్రలో ప్రదీప్ రంగనాథన్ అద్భుతమైన నటన కనబరిచారు. స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు తన ఎక్స్‌ప్రెషన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఆయన నటన, మేనరిజమ్స్ ఈ తరం యువతకు బాగా కనెక్ట్ అవుతాయి. రొటీన్ సన్నివేశాలను సైతం తన పెర్ఫార్మెన్స్తో రిలేటబుల్‌గా మార్చేశాడు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు సహజమైన నటనతో ఆకట్టుకుంది. మంత్రి పాత్రలో శరత్ కుమార్ నటన సినిమాకు ఫన్నీ టచ్ ఇచ్చింది. అవసరమైన చోట సీరియస్‌గా కనిపించి, పాత్ర ట్రాన్స్ఫర్మేషన్ను బాగా పండించారు. రోహిణి, ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో బాగా నటించారు.
సాంకేతికంగా
సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన కీర్తిశ్వరన్ దర్శకుడిగా మారి చేసిన చిత్రం డ్యూడ్. చేసింది మొదటి సినిమే అయిన అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించాడు. అలాగే ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం ప్రాణం పోసిందని చెప్పవచ్చు. విడుదలకు ముందే పాటలు హిట్టవ్వడం. నేపథ్య సంగీతం (BGM) కూడా అద్భుతంగా ఉండడం సినిమాకు ప్లస్ అని చెప్పవచ్చు.
చివరిగా ‘డ్యూడ్’ ఒక రొటీన్ ప్రేమ కథ అయినప్పటికీ హీరో ప్రదీప్ రంగనాథన్ అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్, మరియు సాయి అభ్యంకర్ సంగీతం సినిమాను నిలబెట్టాయి. ఇది క్లాస్ పీకే సినిమా కాదు, పీఆర్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉన్న చిత్రం. ఈ తరం ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే అంశాలు పుష్కలంగా ఉండటం వలన, కొత్త అనుభూతిని ఆశించకుండా, ప్రదీప్ రంగనాథన్ నటనను ఎంజాయ్ చేయడానికి థియేటర్‌కు వెళ్ళొచ్చు. ఒకసారి చూడదగిన సినిమా ఇది.
రేటింగ్ : 2.75/5