‘లవ్ టుడే’లో ప్రదీప్ రంగనాథన్ని చూసి ‘ఎవరీ జూనియర్ ధనుష్..’ అనుకున్నారంతా. ఇప్పుడు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన హీరో అయిపోయాడు తను. దర్శకత్వంలో కూడా పట్టు ఉండటంచేత.. చేస్తున్న ప్రతి సినిమాలో అతని సంతకం కనిపిస్తుంటుంది. అదే ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’లో కూడా కనిపించింది.
ఇదిలావుంటే.. టాలీవుడ్ నిర్మాతల కన్ను ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్‌పై పడింది. మైత్రీ మూవీమేకర్స్ అధినేతలు అతనితో సినిమా లాక్ చేసుకున్నారని ఫిల్మ్ వర్గాల భోగట్టా. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ని తెలుగులో విడుదల చేసింది కూడా మైత్రీమూవీమేకర్సే కావడం గమనార్హం. ప్రస్తుతం విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘ఎల్.ఐ.కె.’ సినిమా చేస్తున్నారు ప్రదీప్ రంగనాథన్.
అందులో కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతోపాటు మైత్రీమూవీ మేకర్స్ సినిమా కూడా సెట్స్ పైకి వెళ్లనున్నదట. కొత్త దర్శకుడు కీర్తీశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడని సమాచారం. లవ్ టుడే, రిటర్న్ ఆఫ్‌ది డ్రాగన్ సినిమాల తరహాలోనే క్రేజీ యూత్‌ఫుల్ కథతో రూపొందనున్న ఈ సినిమాలో మలయాళ భామ మమితా బైజు కథానాయికగా నటించనున్నది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియరానున్నాయి.