ఓవైపు పానిండియా సూపర్‌స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తూ.. మరోవైపు తెరపై దెయ్యాన్ని చూసి భయపడే పాత్ర చేయడం నిజంగా సాహసమే. ‘ది రాజాసాబ్’లో తన ఇమేజ్‌కు భిన్నమైన పాత్ర చేస్తూ అటు అభిమానుల్ని, ఇటు సగటు ప్రేక్షకుడ్ని కూడా స్వీట్ షాక్‌కు గురి చేయబోతున్నారు ప్రభాస్. ‘ది రాజాసాబ్’ ట్రైలర్లో దెయ్యాన్ని చూసి భయపడుతున్న బాహుబలిని చూసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారంతా. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న విడుదల కానున్నది. అయితే.. ఈ సినిమా వాయిదా పడిందని, సంక్రాంతికి విడుదల లేదని కొన్ని రోజులుగా వార్తలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది.
‘ ‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మేట్లలో ఒకేసారి సినిమాను విడుదల చేయనున్నాం. ‘రాజాసాబ్’పై వినిపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దు. ముందుగా చెప్పినట్టే జనవరి 9న ‘ది రాజాసాబ్’ని విడుదల చేస్తున్నాం.’ అని ఓ ప్రకటనలో సంస్థ పేర్కొన్నది. ఈ డిసెంబర్లోనే అమెరికాలో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ జరుపనున్నామని, డిసెంబర్ 25లోపు అన్ని పనులూ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తామని, ఎక్కడా రాజీ పడకుండా హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ‘ది రాజాసాబ్’ని నిర్మిస్తున్నామని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ప్రకటనలో పేర్కొన్నారు.