Prabhas | టాలీవుడ్ సహాయ నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు తప్పనిసరిగా కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండగా… ఆపరేషన్‌కు రూ.50 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. అయితే ఎవరైనా దాతలు ఉంటే సాయం చేయాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వెంకట్ కుమార్తె సహా కుటుంబ సభ్యులు ఇప్పటికే పలుమార్లు ఆర్థిక సహాయం కోరినప్పటికీ, సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదట. కుటుంబం చేసిన విజ్ఞప్తికి గబ్బర్ సింగ్ గ్యాంగ్ (కొంతమంది సహనటులు) మాత్రమే స్పందించారని, మిగిలిన వారు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదని వార్తలు వచ్చాయి.
అయితే ప్రముఖ హీరో ప్రభాస్ ఫిష్ వెంకట్‌కు రూ. 50 లక్షల సాయం ప్రకటించారని స్థానిక, జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి.ఆపరేషన్‌కి కావల్సిన సాయం అందిస్తామని ప్రభాస్ టీం నుండి ఒకరు కాల్ చేసినట్టు జోరుగా ప్రచారాలు అయితే నడిచాయి. ఈ సమయంలో ఆయన అధికారికంగా సాయం ప్రకటించారా? ప్రభాస్ టీం నుంచి ధృవీకరణ వచ్చిందా? అనే విషయాల్లో చాలా మందికి స్పష్టత లేదు.దీనిపై కొందరు ప్రభాస్ టీమ్‌ని వివరణ కోరగా, తాము కాల్ చేయలేదని, ఏదైన విషయం ఉంటే మీడియా ద్వారా తెలియజేస్తామని అన్నారట. దీంతో ప్రభాస్ సాయంకి సంబంధించి వచ్చిన వార్తలు అన్నీ ఫేక్ అని తేలింది.
కుటుంబ సభ్యులు ఒక కిడ్నీని దానం చేయాలన్నా కూడా వారిది మ్యాచ్ కావడం లేదట. నా తండ్రి రక్తం గ్రూపు నాది మ్యాచ్ కాకపోవడంతో డాక్టర్స్ తిరస్కరించారు. నాన్న తమ్ముడి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయినా కూడా ఆయనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దాతలు ఎవరైనా ఉన్నారేమోనని డోనర్ సంస్థలను సంప్రదిస్తున్నాం అని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఫిష్ వెంకట్ విలన్, హాస్య పాత్రలతో ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచారు.. గబ్బర్ సింగ్, బన్నీ, దిల్, నాయక్, అత్తారింటికి దారేది, డీజే టిల్లు, అదుర్స్, ఢీ, మిరపకాయ్ వంటి హిట్ సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆహాలో రిలీజ్ అయిన ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ మూవీలో కూడా నటించి అలరించారు. అలాగే, ‘మా వింత గాధ వినుమా’ మూవీలో కనిపించి సందడి చేశారు.