Prabhas | ప్రభాస్ ‘ది రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల షూటింగ్‌లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రథమార్ధంలో ‘ది రాజాసాబ్’.. ద్వితీయార్ధంలో ‘ఫౌజీ’ సినిమాల విడుదలు ఉంటాయని తెలుస్తున్నది. పనిలో పనిగా మే నుంచి ‘స్పిరిట్’ షూటింగ్‌ని మొదలుపెట్టనున్నారట ప్రభాస్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి చేశారట దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. డైలాగ్ వెర్షన్ కూడా పూర్తయిందని, బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని యూనిట్ వర్గాల సమాచారం.
రెండు నెలల క్రితం ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన భూషణ్‌కుమార్ ‘స్పిరిట్’ షూటింగ్‌ని జనవరి నుంచి మొదలుపెడతామని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ కొన్ని కారణాల వల్ల, ముఖ్యంగా ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలూ దాదాపు పూర్తి కావచ్చాయి.
అందుకే మే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ని మొదలుపెట్టనున్నారట సందీప్‌రెడ్డి వంగా. తొలి షెడ్యూల్లో ప్రభాస్‌పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట. ఇందులో కథానాయికగా రష్మిక గానీ, మృణాళ్ఠాకూర్ గానీ నటిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ‘స్పిరిట్’ విడుదల ఉంటుందట. బౌండ్ స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో సందీప్ లేట్ చేయడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.