హీరోలు ఒకేసారి రెండుమూడు సినిమాలు చేసే రోజులు కావివి. ఒక సినిమానే ఏళ్ల తరబడి లాగుతున్న రోజులివి. కానీ ప్రభాస్ ప్రయాణం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒకే టైమ్‌లో రెండు మూడు సినిమాలను కానిచ్చేస్తున్నారాయన. మొన్నటిదాకా ‘రాజా సాబ్’ షూటింగ్లో బిజీబిజీగా గడిపారు ప్రభాస్. ఇప్పుడు ఆ సినిమాకు కాస్త గ్యాప్ ఇచ్చి, ‘ఫౌజీ’ సెట్లోకి అడుగుపెట్టారట.
హను రాఘవపూడి డైరెక్షన్లో పీరియాడిక్ వార్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నది. పీరియాడిక్ వార్ సీన్స్‌ని ప్రస్తుతం ప్రభాస్‌పై చిత్రీకరిస్తున్నారని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ 20 రోజులపాటు జరుగుతుందట. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.