సంక్రాంతికి రాబోతున్న సినిమాలన్నింటిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమా ‘ది రాజాసాబ్’. పానిండియా సూపర్‌స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమా కావడంతో అభిమానుల్లోనే కాక, సగటు ప్రేక్షకుల్లో కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొని ఉన్నది. పైగా దర్శకుడు మారుతి ఈ తరహా సినిమాలు చేయడంలో సిద్ధహస్తుడు. సంజయ్‌దత్ కీలక పాత్ర పోషించారు. ఇవన్నీ కూడా ఈ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసిన అంశాలే.
జనవరి 9న ‘ది రాజాసాబ్’ విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ని పురస్కరించుకొని ‘రాజే యువరాజే’ అంటూ సాగే ఈ సినిమాలోని పాట ప్రోమోను గురువారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ప్రభాస్ ఏర్పాట్లు చేయడం, చర్చికి వెళ్లి నిధి అగర్వాల్ ప్రేయర్ చేయడం చూపించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసే విధంగా ఈ ప్రోమో సాగింది. హారర్ కామెడీ జోనర్లో ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయేలా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని మలిచారని, భారీ నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారని మేకర్స్ చెబుతున్నారు.