పాన్ ఇండియా లైనప్‌ను కొనసాగిస్తున్నారు స్టార్ హీరో ప్రభాస్. ఆయనకు ప్రస్తుతమున్న భారీ చిత్రాల జాబితాలో మరొకటి చేరింది. ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు. త్వరలోనే ఇదే కాంబినేషన్లో మరో చిత్రం రానుందని సమాచారం. పౌరాణిక నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికే ‘ఆది పురుష్’ అనే ఇతిహాసిక చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు. దిల్ రాజు మాట్లాడుతూ…ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా చేయాలని నిర్ణయించాం. కథ ఇప్పటికే సిద్ధమైంది. పౌరాణిక నేపథ్యంతో ఈ సినిమా ఉంటుంది. ఎన్టీఆర్‌తో ప్రశాంత్ చేస్తున్న సినిమా తర్వాత ఈ కాంబో మూవీ సెట్స్ మీదకు తీసుకెళ్తాం. అన్నారు. ‘సలార్’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఇందులో శృతి హాసన్ నాయికగా నటిస్తున్నది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. సెప్టెంబర్ 28న విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను జూన్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ ఖాతాలో ‘ప్రాజెక్ట్ కె’, ‘ఆది పురుష్’, ‘స్పిరిట్’, మారుతి డైరెక్షన్ మూవీ ఉన్నాయి.