“కల్కి 2898 ఏడీ’ చిత్రంలో భాగం కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇదొక అద్భుతమైన అనుభవం. ఈ సినిమా ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు. ఇలాంటి సినిమాను గతంలో ఎప్పుడూ చేయలేదు’ అన్నారు బిగ్‌బి అమితాబ్ బచ్చన్. బుధవారం ముంబయిలో ‘కల్కి 2898 ఏడీ’ ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్, కథానాయిక దీపికా పడుకోన్, కమల్‌హాసన్, చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పాల్గొన్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినిదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా అమితాబ్‌బచ్చన్ మాట్లాడుతూ ‘నాగ్అశ్విన్ ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఇందులో ఉన్న విజువల్స్ మరో స్థాయిలో ఉంటాయి. ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ను ఎప్పటికీ మర్చిపోలేను’ అన్నారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ ‘దర్శకుడు నాగ్అశ్విన్ మా గురువు బాలచందర్గారిలా ఆర్డీనరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డీనరీ మ్యాన్. తన ఐడియాను తెరపైకి అద్భుతంగా తీసుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషించాను. నా పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది’ అని చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్ వంటి గ్రేటెస్ట్ లెజెండ్స్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
కమల్‌హాసన్‌గారు నటించిన ‘సాగరసంగమం’ చూసి అలాంటి డ్రెస్ కావాలని మా అమ్మను అడిగాను. ‘ఇంద్రుడు చంద్రుడు’ సినిమా చూసి ఆయనలా యాక్టింగ్ చేసేందుకు ప్రయత్నించే వాడిని. అలాగే దీపికా పడుకోన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్‌తో పనిచేయడం మరపురాని అనుభూతినిచ్చింది’ అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని, దర్శకుడు నాగ్అశ్విన్ తెరపై మ్యాజిక్ క్రియేట్ చేశారని దీపికా పడుకోన్ చెప్పింది. అమితాబ్‌బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పడుకోన్ వంటి అగ్ర తారల సమక్షంలో ఈ వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉందని నిర్మాత అశ్వినిదత్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.