వెండితెరపై కొన్ని హిట్ పెయిర్స్‌ని ఆడియన్స్ అమితంగా అభిమానిస్తారు. వారి కాంబినేషన్‌ని మళ్లీ మళ్లీ చూడటానికి ఇష్టపడతారు. అలాంటి హిట్ పెయిరే.. ప్రభాస్, అనుష్క. వీరి కలయికకు సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ. ‘బాహుబలి’ ఫ్రాంచైజీ తర్వాత ఈ జంట మళ్లీ వెండితెరపై కలిసి కనిపించలేదు. వారి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని కోరుకునే ప్రేక్షకులు కోకొల్లలు. వారందరి కోరిక త్వరలో తీరబోతున్నట్టు తెలుస్తున్నది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపిక పదుకొణే కథానాయికగా ఎంపికైనట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. ఈ కథలో మరో కథానాయికకు కూడా ఛాన్స్ ఉందట. ఆ పాత్రకు సౌత్ స్టార్ హీరోయిన్ అయితే బావుంటుందని సందీప్‌రెడ్డి వంగా భావిస్తున్నారట. పైగా సెకండాఫ్‌లో వచ్చే ఆ పాత్ర కథలో కీలకంగా ఉంటుందని సమాచారం. అందుకే ఈ పాత్రను అనుష్కతో చేయించాలని సందీప్‌రెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇదే నిజమైతే.. ఈ జంటను ఇష్టపడేవాళ్లకు ‘స్పిరిట్’ ఓ కన్నుల విందే కానున్నదని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.