Power peta Glimpse | యంగ్ హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే కానుక వచ్చింది. కృష్ణ చైతన్య దర్శకత్వంలో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పీరియాడిక్ పొలిటికల్ డ్రామా ‘పవర్ పేట’. ఈ సినిమా నుంచి తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘అడవిలో సింహం ఉచ్చ పోసి ఇది నా చోటు అని చెబుతుంది. ఇక్కడ ఉచ్చపోయిస్తే కానీ ఆ చోటు నీది కాదు’ అంటూ సందీప్ కిషన్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. “ప్రేమ, గౌరవం, రాజకీయం” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, ఒక సామాన్యుడు రాజకీయ శిఖరాలను ఎలా అధిరోహించాడు అనే ఇతివృత్తంతో సాగనుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ మూడు విభిన్న గెటప్స్‌లో కనిపించి మెప్పించబోతుండగా, ఇటీవల హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలో గల ఒక పురాతన థియేటర్లో ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా ఘనంగా ప్రారంభమైంది.
మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ‘మిరాయ్’ ఫేమ్ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.