Poorna | హీరోయిన్ల జీవితాలు మనకు కనిపించేంత సంతోషంగా ఉండవు. నిత్యం షూటింగ్స్, ప్రయాణాలు చేస్తూ ఉండడం వలన కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశమే లభించదు. కొంతమంది భామలు గ్యాప్ దొరికినప్పుడల్లా కుటుంబాంతో గడిపితే, మరికొందరు వెకేషన్ వెళ్తుంటారు. ఇక పెళ్లైన నాయికలైతే తమ పిల్లలు, భర్తతో సమయం గడిపేందుకు తహతహలాడతారు. ఈ క్రమంలో టాలీవుడ్ నటి పూర్ణ భర్త షానిద్ అసిఫ్ అలీ చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతోంది. పూర్ణ ప్రస్తుతం సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో 45 రోజుల పాటు భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఒంటరితనాన్ని భరించలేక, తన మనసులో మాటను సోషల్ మీడియాలో పంచుకున్నాడు ఆమె భర్త.
“ఈ 45 రోజుల్లో నాకు ప్రేమ గొప్పదనం ఏంటో తెలిసొచ్చింది. మనల్ని ప్రేమించే వారు మనతో ఉండటమే నిజమైన వరం. ఎన్నో రోజుల దూరం తర్వాత నేడు నా భార్య తిరిగి నా దగ్గరకు వచ్చింది. ఆనందభాష్పాలు ఆపుకోలేకపోయాను” అని అతను తన పోస్ట్‌లో రాశాడు. ఈ పోస్ట్ చూసిన కొంతమంది నెటిజన్లు వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయని భావించారు. అయితే అలాంటిదేమీ లేదని షానిద్ వెంటనే క్లారిటీ ఇచ్చారు.“నా భార్య 20 రోజులు చెన్నైలో, 15 రోజులు మలప్పురంలో, ఆ తర్వాత ‘జైలర్ 2’ సినిమా షూటింగ్ కోసం తాత్కాలికంగా తన ఇంటిలో ఉంది. మొత్తం 45 రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. పెళ్లైన తర్వాత మేమిద్దరం ఎన్నడూ ఇంతకాలం వేరుగా ఉండలేదు అని చెప్పుకొచ్చాడు.
పూర్ణ (అసలు పేరు షామ్నా కాసిమ్) తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీ మహాలక్ష్మి, సీమ టపాకాయ్, అవును వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల దసరా, అఖండ, గుంటూరు కారం, డెవిల్ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే టీవీ షోల ద్వారా కూడా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.2022 జూన్ 12న దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ వివాహం చేసుకుంది. 2023 ఏప్రిల్‌లో ఈ జంటకు ఓ పండంటి మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సంతోషంగా ఉంది.