‘ఇటీవల ఓ తమిళ సినిమా ఒప్పుకున్నా. ఆడిషన్‌కి రమ్మంటే వెళ్లా. తీరా ఆడిషన్ అయ్యాక.. ఆ పాత్రకు నా వయసు సరిపోదని, మరీ చిన్నదానిలా ఉన్నానని, నన్ను తిరస్కరించి, నాకంటే పెద్ద వయసుగల నటిని తీసుకున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత.. పాత్రకు సరిపోలేదని తప్పించే బదులు.. ముందే ఆడిషన్ చేస్తే బావుండేది కదా?..’ అంటూ ప్రశ్నించింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా చెబుతూ ‘నేను ఎంత పెద్ద స్టార్‌ని అయినా కానివ్వండి. ఆడిషన్‌కి పిలిస్తే వెళతా. అసలు నన్నడిగితే.. పాత్రధారుల్ని ఎంచుకునేముందు ఆడిషన్ చేయడం కరెక్ట్. పాత్రల్లో దమ్ము ఉన్నప్పుడు సదరు ఆర్టిస్ట్‌కి చేయగల సత్తా ఉందా.. లేదా అనేది తెలుసుకునేందుకు ఆడిషన్ అవసరం. అయితే అది అడ్వాన్స్ ఇవ్వకముందే జరగాలి. ఇచ్చాక ఆడిషన్ చేసి తీసేయడం సరైన పద్ధతి కాదు. కథ కూడా చెప్పకుండా, ఫలానా హీరో సినిమా అనేసి, అడ్వాన్స్ ఇచ్చేసి కొందరు వెళ్తుంటారు. అప్పుడే అర్థమైపోతుంది.. ఆ పాత్రలో చేయడానికి ఏమీ ఉండదని. ఆడిషన్‌కి పిలిస్తే.. అది కచ్ఛితంగా మంచి పాత్రే అయ్యుంటుంది. అందుకే ఎవరు ఆడిషన్‌కి రమ్మన్నా వెళ్లిపోతుంటా. కానీ వాళ్లేమో ఇలా బిహేవ్ చేస్తుంటారు.’ అంటూ బాధను వ్యక్తం చేసింది పూజా హెగ్డే.