Players | రాను రాను సినిమాల స్టైల్ మారుతుంది. ఒకప్పుడు నటీనటులు మాత్రమే సినిమాలలో అద్భుతమైన నట ప్రదర్శన కనబరిచి ప్రేక్షకులని అలరించేవారు. కాని ఇప్పుడు వారికి తోడు ప్లేయర్స్ కూడా సినిమాలలో కనిపించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పట్లో అశ్వినీ నాచప్ప.. ఆ తర్వాత వివిఎస్ లక్ష్మణ్.. ఇలా పలువురు ప్లేయర్స్ సినిమాలలో నటించి అలరించారు. ఆ మధ్య వెంకటేష్ హీరోగా రూపొందిన గురులో నటించిన రితిక సింగ్ కూడా ప్రొఫెషనల్ బాక్సరే. అయితే ఇప్పుడు మన దర్శకులు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ పై దృష్టి పెట్టారు. వారికి తమ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ ఇచ్చి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సినిమాకి హైప్ అయితే వస్తుంది కాని రిజల్ట్ తేడా కొట్టడంతో మేకర్స్‌ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఇటీవల విడుదలైన రాబిన్ హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ కీలక పాత్రలో నటించారు. ఈ క్యారెక్టర్ గురించి చాలా బిల్డప్ ఇవ్వడమే కాకుండా ప్రమోషన్స్ కోసం అతనిని చాలా వాడుకున్నారు. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు సినిమాలో వార్నర్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందేమో, చాలా సేపు కనిపించి అలరిస్తాడేమో అని అనుకున్నారు. కాని తీరా సినిమా చూస్తే వార్నర్ పాత్రకు స్కోప్ లేదు.. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్‌ను మరీ కమెడియన్లా చూపించడమేంటని తిట్టిపోస్తున్నారు. ఇక సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
మరోవైపు రెండేళ్ల కింద పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేశారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కించారు. మరోవైపు ఈ సినిమా కోసం మైక్ టైసన్‌ని రంగంలోకి దింపారు. మా సినిమాలో టైసన్ ఉన్నాడంటూ చిత్ర బృందం బాగా ప్రమోట్ చేసుకుంది… తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే మైక్ టైసన్‌ను చాలా దారుణంగా చూపించారంటూ తిట్టిపోసారు. ఇంటర్నేషనల్ ప్లేయర్స్‌ని సినిమాలలోకి తీసుకొచ్చి వారి పరువు తీస్తున్నారు, ఇది మీకేమైన కరెక్ట్ అనిపిస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అప్పుడు టైసన్.. ఇప్పుడు వార్నర్.. అలా మన దర్శకుల దగ్గర బుక్ అయిపోయారు.