BV Pattabhiram | ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాదలో ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగానూ.. ప్రముఖ హిప్నాటిస్ట్గానే ఆయన పేరు ప్రఖ్యాతలు సాధించారు. సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఆయనకు భార్య జయ, కొడుకు ప్రశాంత్ ఉన్నారు. ఆయన మృతికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బీవీ పట్టాభిరాం పూర్తి పేరు భావరాజు వేంకట పట్టాభిరామ్. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి. పట్టాభిరామ్ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, హిప్నాటిస్టు, మెజీషియన్. తెలుగు, ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషల్లో పలు రచనలు చేశారు. ఆయన విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు తల్లిదండ్రుల అవగాహన సదస్సులు నిర్వహించారు. దూరదర్శన్‌లో అనేక మేజిక్ షోలు ఇచ్చారు. 1990లలో పలు పత్రికలో ‘బాలలకు బంగారుబాట’ అనే శీర్షికలో అనేక మంది ప్రపంచ ప్రముఖుల జీవితచరిత్రలు గురించి వ్యాసాలు రాశారు. బాలజ్యోతి అనే బాలల పత్రికలో ‘మాయావిజ్ఞానం’ పేరిట వ్యాసాలు రాశారు పట్టాభిరామ్.
పట్టాభిరామ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ఆ తర్వాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లలో పట్టా అందుకున్నారు. గైడెన్స్, కౌన్సిలింగ్, జర్నలిజంలో పీజీ డిప్లమా పూర్తి చేశారు. మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీలలో అమెరికా నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. ఒత్తిడిని జయించడం, వ్యక్తుల మధ్య సంబంధాలు, అసర్టివ్ నెస్, సెల్ఫ్ హిప్నాటిజం మొదలైన అంశాలపై భారత్‌లోని అనేక ప్రాంతాలలో, అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, అరబ్ దేశాల్లోనే అనేక వర్క్‌షాప్‌లు నిర్వహించారు. హిప్నోసిస్పై ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ని ప్రదానం చేసింది. నాష్‌విల్ల్, న్యూ ఆర్లియన్స్ నగర మేయర్లు గౌరవ పౌరసత్వం సైతం ప్రదానం చేశారు.
ప్రశాంతి కౌన్సెలింగ్ అండ్ హెచ్ఆర్డీ సెంటర్‌ను నెలకొల్పారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, పోలీసు అకాడమీ, షార్ శ్రీహరి కోట, జుడిషియల్ అకాడమీ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవనరుల సంస్థ (IOA), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్, మచిలీపట్నం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRD), సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ (CIRE), సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ స్కూల్, డీఆర్డీఎల్, డెల్, డెలాయిట్, రామకృష్ణ మఠం, రెడ్డిల్యాబ్స్, మహీంద్రా సత్యం, జీఈ, బేయర్ బయోసైన్స్, జేఎన్ టీయు అకాడమీ స్టాఫ్ కాలేజీ, ఉస్మానియా అకాడమీ స్టాఫ్ కాలేజీ, భారత్ హెవీ ఎలక్ట్రిక్స్ లిమిటెడ్ (బెల్) ఇంకా ఎన్నో విద్యాసంస్థలకు గౌరవ సలహాదారుగా ఉన్నారు. వ్యక్తిత్వ వికాసం, మానవవిలువలు, మ్యాజిక్‌పై తెలుగు, కన్నడ, తమిళం, మరాఠీ భాషల్లో వందకుపైగా పుస్తకాలను ప్రచురించారు.