Peddi Ticket Rates : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సర్వం సిద్ధమైంది. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా అనుమతులు జారీ చేసింది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు అదనపు ధరలతో టికెట్లు విక్రయించుకోవచ్చు.
ప్రస్తుతం అమలులో ఉన్న సాధారణ ధరలపై సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు అదనంగా వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అనుమతులు జూన్ 4 నుంచి జూన్ 10 వరకు అమల్లో ఉండనున్నాయి. సినిమా విడుదలకు ఒకరోజు ముందే అంటే జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ స్పెషల్ షోల టికెట్ ధరను జీఎస్టితో కలిపి రూ.600గా నిర్ణయించారు. ఇటీవల విడుదలైన కొన్ని భారీ సినిమాలకు ప్రీమియర్ టికెట్లు వెయ్యి రూపాయలకుపైగా విక్రయించిన సందర్భాలు ఉండగా.. ‘పెద్ది’కు మాత్రం అందుబాటు ధరలోనే టికెట్ నిర్ణయించడం అభిమానులను ఆకట్టుకుంటోంది. మధ్యతరగతి ప్రేక్షకులు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎంజాయ్ చేసేలా ఈ నిర్ణయం ఉందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
టికెట్ ధరల పెంపుతో పాటు థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో విడుదల రోజునే భారీ స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అవకాశం మేకర్స్‌కు లభించింది. ప్రస్తుతం సినిమాపై ఉన్న హైప్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ స్థాయిలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మెగా అభిమానులు ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే భారీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ‘పెద్ది’ చిత్రం 1980ల కాలం నాటి గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కింది. ఒక సాధారణ యువకుడు క్రీడల ద్వారా తన గ్రామాన్ని ఎలా ఏకం చేశాడు? ఊరి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి ఎలా పోరాడాడు? అనే ఆసక్తికరమైన కథాంశంతో సినిమా రూపొందింది.ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలైట్ కానుంది.