Peddi | పెద్ది సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలు అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో అనేక వాయిదాలు పడుతుండటంతో అభిమానుల్లో అసంతృప్తి పెరిగింది. ఇటీవల ఓ ఈవెంట్లో బుచ్చిబాబు సాన జూన్ 25న సినిమా విడుదల అవుతుందని పేర్కొనడంతో ఫ్యాన్స్ కొంత ఊరట పొందారు. అయినప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రెస్ మీట్ లేదా పూర్తి స్థాయి ప్రమోషన్స్ నిర్వహించకపోవడం గమనార్హం.
సినిమా స్థాయి దృష్ట్యా పెద్దగా ప్రమోషన్స్ అవసరం లేకపోయినా, కనీస అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ సెట్స్ నుంచి కొన్ని వర్కింగ్ స్టిల్స్ మాత్రమే విడుదల చేయడం తప్ప మిగతా వివరాలపై మేకర్స్ నిశ్శబ్దంగా ఉండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.ఈ నేపథ్యంలో సినిమాపై స్పష్టత ఇవ్వడానికి నేడు హైదరాబాద్‌లో ఓ స్టార్ హోటల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నిర్మాత వెంకట సతీష్ కిలారు, మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు బుచ్చిబాబు సాన హాజరుకానున్నారు. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఈ ప్రెస్ మీట్‌కు రామ్ చరణ్ హాజరవుతారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఇటీవల ఆయన పబ్లిక్‌గా కనిపించకపోవడంతో అభిమానులు ఆయన హాజరు కావాలని ఆశిస్తున్నారు. మరోవైపు జాన్వీ కపూర్ ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్లో రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటనతో పాటు, సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ వెలువడే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ‘పెద్ది’పై నెలకొన్న సందేహాలకు నేడు క్లారిటీ వచ్చే అవకాశముంది.