Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించిన చిత్రబృందం, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల అభిమానుల కోసం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరగనుండటం విశేషం. సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, జూన్ 1న విజయవాడలోని ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం (ఇందిరా గాంధీ గ్రౌండ్స్)లో ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్నప్పటికీ, అభిమానుల రద్దీ దృష్ట్యా అంతకుముందే సందడి మొదలయ్యే అవకాశం ఉంది.
ఇటీవల విడుదలైన ‘పెద్ది’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఆయన నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశమున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ, పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి వస్తే మెగా అభిమానులకు ఇది మరింత ప్రత్యేకంగా మారనుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు మరియు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొననున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అంశాలు, ప్రత్యేక అప్డేట్లు ఈ కార్యక్రమంలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక విడుదల విషయానికి వస్తే, ‘పెద్ది’ చిత్రం జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియర్ షోలకు అనుమతులు లభించినట్లు సమాచారం. అలాగే టికెట్ ధరల పెంపునకు సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో సినిమా విడుదల కానుంది. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదలకు ముందు విజయవాడలో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.