Peddi | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ భారీ వసూళ్లు రాబడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ప్రేక్షకులతో కిటకిటలాడుతుండగా, ఈ సినిమా క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు దొంగ నోట్లను చలామణి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో కలకలం రేపుతోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కాసు మల్టీఫ్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం పెద్ది సినిమా ప్రదర్శితమవుతుండటంతో థియేటర్ వద్ద ప్రేక్షకుల రద్దీ భారీగా ఉంది. టికెట్ కౌంటర్లు, క్యాంటీన్ల వద్ద కొనుగోళ్ల కోసం జనం పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు.
ఈ రద్దీని అవకాశంగా మలుచుకున్న కొందరు వ్యక్తులు టికెట్లు, ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో నకిలీ కరెన్సీ నోట్లను ఇచ్చి చలామణి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. రోజు ముగిసిన తర్వాత నగదు లెక్కింపు సమయంలో కొన్ని నోట్లు అనుమానాస్పదంగా కనిపించడంతో సిబ్బంది వాటిని పరిశీలించగా అవి నకిలీవని తేలింది. విషయం బయటపడటంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు టికెట్ కౌంటర్లు, క్యాంటీన్ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రద్దీ సమయంలో లైన్లలో నిలబడి నకిలీ నోట్లను చలామణి చేసిన వ్యక్తులను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటన వెనుక ఒక్కరే ఉన్నారా? లేక నకిలీ కరెన్సీ చలామణి చేసే ఏదైనా ముఠా పని చేస్తున్నదా? అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు వ్యాపార వర్గాలకు అప్రమత్తత సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, షాపింగ్ సెంటర్లు, మార్కెట్లు, పెట్రోల్ బంకులు వంటి ప్రాంతాల్లో నగదు స్వీకరించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నకిలీ నోట్లను గుర్తించే యంత్రాలను ఉపయోగించడం, పెద్ద మొత్తంలో నగదు తీసుకునే సమయంలో నోట్లను క్షుణ్ణంగా పరిశీలించడం అవసరమని పేర్కొన్నారు. సినిమా టికెట్లు, పాప్‌కార్న్ కొనుగోలు చేయడానికే నకిలీ నోట్లను ఉపయోగించే స్థాయికి కేటుగాళ్లు దిగజారడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెద్ది సినిమా క్రేజ్ మధ్య జరిగిన ఈ ఘటన ప్రేక్షకులను, వ్యాపారులను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా, నిందితులను త్వరలో గుర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది.