Peddi | గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని ఆసక్తిగా ఎదురుచూస్తున్న జపాన్ అభిమానులకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది. మొదట్లో చిత్రబృందం పెద్ది సినిమాను భారతదేశంతో పాటు జపాన్‌లో కూడా అదే రోజున విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్‌లో భారీ విజయం సాధించడంతో అక్కడ రామ్‌చరణ్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ సినిమా ద్వారా ఆయన నటనకు జపాన్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.
దీంతో పెద్ది సినిమాను కూడా జపాన్‌లో ఒకేసారి విడుదల చేస్తే మంచి స్పందన వస్తుందని నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. జపాన్ అభిమానులు కూడా ఈ వార్తతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే విడుదలకు కొద్ది రోజుల ముందు చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కొన్ని అనివార్య కారణాల వల్ల జపాన్‌లో పెద్ది సేమ్ డే రిలీజ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 4న సినిమా అక్కడ విడుదల కానట్లైంది.ఈ వార్తతో జపాన్‌లోని రామ్‌చరణ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అలాగే అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రేక్షకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ అదే రోజు విడుదల జరిగి ఉంటే అంతర్జాతీయ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇక పెద్ది చిత్రంలో రామ్‌చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, జపాన్ విడుదల వాయిదా వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.