Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ చిత్రబృందం ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేస్తోంది.దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు ఇప్పటికే ఉత్తర, దక్షిణ భారతదేశంలోని పలు ప్రధాన నగరాల్లో ప్రత్యేక ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహించిన చిత్ర యూనిట్, ఇప్పుడు హైదరాబాద్‌లో మరో కీలక ఈవెంట్‌కు సిద్ధమైంది. సినిమా విడుదలకు ముందు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా ముచ్చటించేందుకు నేడు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. వేలాది మంది అభిమానుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సినిమాపై మరింత హైప్‌ను తీసుకువచ్చింది. ఇప్పుడు అదే ఉత్సాహాన్ని హైదరాబాద్‌లో కొనసాగించేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరగనున్న ఈ ప్రెస్ మీట్‌కు హీరో రామ్ చరణ్‌తో పాటు హీరోయిన్ జాన్వీ కపూర్, ప్రముఖ నటులు జగపతి బాబు, దివ్యేందు శర్మ, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకట సతీష్ కిలారు తదితరులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సినిమా విశేషాలు, పాత్రల గురించి ఆసక్తికర విషయాలు, విడుదలకు ముందు చివరి అప్డేట్స్ను చిత్రబృందం పంచుకోనుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, విలేజ్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా రామ్ చరణ్ కొత్త లుక్, బుచ్చిబాబు కథన శైలి, ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా మారాయి. మరోవైపు, జూన్ 3 రాత్రి నుంచే ఓవర్సీస్ మార్కెట్లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. దీంతో విడుదలకు ముందే ‘పెద్ది’ హవా మొదలైందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.