Pawan Controversy | భోజ్‌పురి సినీ పరిశ్రమలో వివాదాస్పద వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నటుడు, గాయకుడు పవన్ సింగ్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. ఈసారి వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. రెండో భార్య జ్యోతి సింగ్ తో ఇంటి వద్ద జరిగిన ఘర్షణ, పోలీసుల జోక్యంతో హైడ్రామా నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాలలోకి వెళితే పవన్ సింగ్ రెండో భార్య జ్యోతి సింగ్, ఇటీవల లక్నోలోని ఆయన నివాసానికి వెళ్లి భర్తను కలవాలనుకున్నారు. అయితే తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చిందని చెబుతూ పవన్ సింగ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో లేడీ కానిస్టేబుళ్లు ఆమెను బయటకు తీసుకెళ్లారు.
ఈ క్రమంలో జ్యోతి సింగ్ తీవ్ర ఆవేదనకు గురై, తన భర్తను కలవకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “నేను నా భర్తను కలవడానికి వచ్చాను, పోలీసులతో ఇంట్లోంచి బయటకు పంపించడం అవమానకరం. ఇది నా పర్సనల్ ఇష్యూ. నన్నెందుకు తీసుకెళ్తున్నారు?” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జ్యోతి సింగ్, ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. నేను పవన్‌ను కలవడానికి వచ్చాను. నన్ను ఇంట్లోకి రానీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలన్నదే నా కోరిక. ఇప్పుడు నేను ఏం చేయాలి?” అని ఎమోషనల్ అయింది.
పవన్ సింగ్, జ్యోతి సింగ్ మధ్య ఇప్పటికే మనస్పర్థలు ఉన్నాయి. పవన్ ఇప్పటికే విడాకుల కోసం కోర్టుకి దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. కేసు ప్రస్తుతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయితే జ్యోతి సింగ్ మాత్రం విడాకులు వద్దని, భర్తతో జీవించాలనే ఆశతో లక్నోలోని ఆయన ఇంటికి వెళ్లారు. కానీ ఇది పెద్ద ఇష్యూ అయింది. జ్యోతి తనను, తన కుటుంబాన్ని వేధించేందుకు వస్తోందని పవన్ సింగ్ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. తనకు భౌతిక, మానసిక రక్షణ కల్పించాలని ఆయన ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా ఆమెను ఇంటి నుండి బయటకు తీసుకెళ్లారు. కాగా, పవన్ సింగ్ పబ్లిక్ ఈవెంట్స్‌లో హీరోయిన్లపై అనుచితంగా ప్రవర్తిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.