Womens Reservation Bill | మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది.
చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక అవకాశాన్ని ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాయని, కేవలం రాజకీయ లెక్కల కోసమే దేశాభివృద్ధిని పక్కన పెట్టాయని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ విఫలం కావడానికి ప్రతిపక్షాల తీరే కారణమని, వారికి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. మోదీని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలకు అబద్ధాలు చెప్పవద్దని కౌంటర్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని, దానిని అమలు చేసే అధికారం పూర్తిగా ప్రభుత్వం చేతిలోనే ఉందని ఆయన గుర్తుచేశారు. మహిళా రిజర్వేషన్ల నెపంతో కేంద్రం తీసుకురావాలని చూస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వల్ల ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోతుందని, దీనిపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మిమ్మల్ని డిప్యూటీ సీఎంగా గెలిపించిన ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను పణంగా పెట్టవద్దని హితవు పలికిన ఆయన, ఈ అంశంపై తనతో చర్చకు సిద్ధమా అంటూ #justasking హ్యాష్ ట్యాగ్‌తో పవన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ఒకవైపు ఎన్డీయే భాగస్వామిగా కేంద్రాన్ని పవన్ సమర్థిస్తుండగా, మరోవైపు దక్షిణాది ప్రయోజనాల కోసం ప్రకాష్ రాజ్ ఆయనను నిలదీయడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you… https://t.co/LyQGy2Fh8E
— Prakash Raj (@prakashraaj) April 18, 2026