ఇటీవలే ‘హరిహరవీరమల్లు’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించిన అగ్ర హీరో పవన్‌కల్యాణ్ ప్రస్తుతం తన తాజా సినిమాలపై దృష్టిపెట్టారు. వాటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఆయన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్లో పాల్గొంటున్నారు. హరీశ్‌శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.
హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్లో ఈ సినిమా ైక్లెమాక్స్ ఘట్టాలను పూర్తి చేసినట్లు మేకర్స్ తెలిపారు. భారీ పోరాటాలు, భావోద్వేగాలు కలబోసిన ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుందని, ఫైట్ మాస్టర్ నబకాంత నేతృత్వంలో దీనిని చిత్రీకరించామని చిత్రబృందం పేర్కొంది.
ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘గబ్బర్‌సింగ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత పవన్‌కల్యాణ్-హరీశ్‌శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, రచన-దర్శకత్వం: హరీష్‌శంకర్.ఎస్.