Pawan Kalyan | రాజకీయాలలోకి వచ్చాక సినిమాలు తగ్గించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రజల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. అయితే ఇప్పుడు ఏ పని చేసిన కూడా అది క్షణాలలో వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ తన క్యాంప్ ఆఫీసుకి 96 ఏళ్ల బామ్మని పిలిపించుకొని ఆమెకి భోజనం పెట్టి చీర, కొంత డబ్బుని బహుకరించారు. 96 ఏళ్ల వృద్ధురాలు పోతుల పేరంటాలు పవన్‌తో కలిసి భోజనం చేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాకినాడ జిల్లాకు చెందిన పేరంటాలు, పవన్ కల్యాణ్‌తో భోజనం చేయాలని ఎప్పటి నుండో అనుకునేది. ఈ విషయం తాజాగా పవన్ కళ్యాణ్‌కి తెలియగా, ఆయన వెంటనే స్పందించి ఆమెను జనసేన క్యాంపు కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.
క్యాంపు ఆఫీసుకి వచ్చిన పేరంటాలుని ప్రేమగా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆమెతో కలిసి భోజనం చేశారు. అంతేకాకుండా, ఆ వృద్ధురాలికి లక్ష రూపాయల నగదును ఆర్థిక సహాయంగా అందించి, కొత్త చీరను కూడా బహూకరించారు. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పేరంటాలుని సొంత ఇంటి మనిషిలా చూసుకోవడంతో అందరు అవాక్కయ్యారు. పేరంటాలు ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పాలి. ప్రస్తుతం ఈ అపురూప దృశ్యాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. కాగా, కాకినాడ జిల్లా, కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పోతుల పేరంటాలు, పవన్ కల్యాణ్ మరియు జనసేన పార్టీకి వీరాభిమాని.
2024 సార్వత్రిక ఎన్నికలలో పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో ఆయన విజయం కోసం పేరంటాలు తమ గ్రామంలోని వేగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసి, పొర్లు దండాలు సమర్పించారు. పవన్ గెలుపొందితే అమ్మవారికి వెండి గరగ చేయించి సమర్పిస్తానని కూడా మొక్కుకున్నారు. ఎన్నికలలో పవన్ కల్యాణ్ ఘనవిజయం సాధించడంతో, తనకు ప్రభుత్వం నుంచి లభిస్తున్న పింఛను డబ్బుల నుంచి ప్రతినెలా రూ.2,500 చొప్పున దాచిపెట్టారు. అలా 2025 మే నెల నాటికి రూ.27,000 కావడంతో , ఆ మొత్తంతో వేగులమ్మ తల్లికి వెండి గరగ చేయించి సోమవారం నాడు భక్తిశ్రద్ధలతో సమర్పించారు.