Pawan Kalyan | అరకుకు అతి సమీపంలో ఉన్న ఒక చిన్న గిరిజన తండాలో రెండువందలకుపైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి . అభివృద్ధి వెలితిలో ఉన్న ఈ చిన్న గ్రామంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లూరి జిల్లాలోని పెదపాడు, కురిడి గ్రామాలను సందర్శించారు. గ్రామ సభ నిర్వహించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. కురిడి గ్రామంలో శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు. గ్రామస్తుల రోడ్డు సమస్యలు చూసి తానే స్వయంగా రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం అధికారులను పిలిచి మౌలిక సదుపాయాలు కల్పించేలా ఆదేశాలు జారీ చేశారు.
ఇక తాజాగా వారికి ఆర్గానిక్ పండ్లు పంపి మంచి మనసు చాటుకున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తన తోటలో అర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను కురిడి గ్రామస్తులకు పంపించారు. “ప్రతి గడపకు మామిడి పండ్లు అందాలి” అంటూ సిబ్బందిని ఆదేశించారు.ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ వాహనంలో పండ్లు గ్రామానికి చేరిన తర్వాత, 230 కుటుంబాలకు అరడజను చొప్పున మామిడి పండ్లు పంపిణీ చేశారు.పిల్లలు, పెద్దలు అందరూ “పవన్ సారు పంపిన మామిడిపండ్లు” అంటూ సంతోషంగా తినడం, ఆయన్ను ఆశీర్వదించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందు పెదపాడు గ్రామాన్ని సందర్శించిన సమయంలో బట్టలు లేక పిల్లలు, వృద్ధులు, మహిళలు నడకల దారిలో ముళ్ళు, రాళ్ల మధ్య చెప్పుల్లేక నడుస్తున్న దృశ్యం పవన్ కళ్యాణ్‌ను కలచివేసింది.
ఆ వెంటనే ఉపాధిహామీ సిబ్బందితో గ్రామంలో ఉన్న 345 మందికి సరిగ్గా సరిపోయే పాదరక్షలు పంపించారు. సర్పంచ్ సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి, పవన్ కార్యాలయ సిబ్బంది చెప్పులు పంపిణీ చేశారు. అయితే కురిడి గ్రామస్థులకు పవన్ పంపించిన మామిడి పండ్లు సాధారణ మామిడి పండ్ల ఉన్నా పెద్దగా ఉండే సరికి ఏజెన్సీ వాసులు ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద సైజులో మామిడి పండ్లను ఎలా పండించొచ్చనే దిశగా ఏజెన్సీ రైతులను పవన్ ఆలోచింపజేశారని చెప్పొచ్చు. ఏప్రిల్ 8న ఏజెన్సీలో పర్యటించిన సమయంలోనే సేంద్రీయ పద్ధతిలో మామిడి సాగు చేయాలని గిరిజనులకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.