Pawan Kalyan | సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియాలో సందేశాలతో, ప్రత్యేక పోస్టులతో వేడుక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడితో దిగిన పాత ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనాని గా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ స్పెషల్ పోస్ట్ చేసారు.
చిరంజీవి శుభాకాంక్షలకు పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పందన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానమైన అన్నయ్య, పద్మవిభూషణ్ చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు నాకు అపారమైన ఆనందాన్ని ఇచ్చాయి. సమాజానికి సేవ చేయాలనే భావన మీరు నేర్పిన సేవా గుణం వల్లే వచ్చింది. నేడు జనసేన పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాను. మీరు ఎప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, నాతోపాటు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కోరుకుంటున్నా” అంటూ మెగాస్టార్‌కు పవన్ థాంక్స్ చెప్పారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు కూడా తమ్ముడికి శుభాకాంక్షలు తెలిపారు. “ప్రియమైన కల్యాణ్ బాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు” అంటూ తమ్ముడ్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనికి పవన్ కల్యాణ్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. “హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నన్నయ్య నాగబాబు గారు. మీరు ‘లా’ చదివే సమయంలో నాకు బహుమతిగా ఇచ్చిన పుస్తకమే నాలో రాజకీయ చైతన్యాన్ని కలిగించింది” అని పవన్ పేర్కొన్నారు. ప్రముఖ న్యాయ నిపుణుడు నానీ పాల్కివాలా రచించిన “వుయ్ ద నేషన్” అనే పుస్తకాన్ని నాగబాబు తనకు బహుమతిగా ఇచ్చారని, అదే తన ఆలోచనా విధానాన్ని మార్చి రాజకీయాల వైపు ప్రేరేపించిందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన రాజకీయ ప్రయాణానికి ఆ పుస్తకమే తొలి అడుగు అని పవన్ పరోక్షంగా తెలిపారు. అలాగే తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.