Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ OG (ఓజీ), గురువారం (సెప్టెంబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కూడా ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బుధవారం రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభం కాగా, అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్లకు చేరుకుని పవన్ మ్యానియాని చూసి ఫుల్ ఖుష్ అయ్యారు. సోషల్ మీడియాలో ‘OG’కి సంబంధించిన రివ్యూలు వేగంగా వైరల్ అవుతున్నాయి. సినిమా చూసిన మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సినిమా ఘన విజయం సాధించిందంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
#BlockbusterOG హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ చేస్తూ, పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్, డైరెక్టర్ సుజీత్ స్టైల్, తమన్ మ్యూజిక్ అన్ని అదిరిపోయాయని కొనియాడుతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్‌కి ప్రతీ సీన్లో ఎలివేషన్స్ అదిరిపోయాయి, OG అంటే ఫ్యాన్స్ కోసం తీసిన ఫుల్ మాస్ ఫీస్ట్ అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్లతో సోషల్ మీడియా నింపేస్తున్నారు. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ రచ్చ కూడా ఓ రేంజ్‌లోనే ఉంది. సినిమా కథ, స్క్రీన్‌ప్లే విషయాల్లో తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొందరు యూజర్లు #OGDisaster, #SujeethFail అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రోల్ చేస్తూ, నెగిటివ్ టాక్‌ను పెంచుతున్నారు.
పవన్ యాక్టింగ్ ఆశించిన స్థాయిలో లేదని, కథలో బలం లేదు, లాజిక్ లేని సీన్స్ ఎక్కువ ఉన్నాయని, ఎలివేషన్స్ తప్ప మరే ఎమోషన్ లేదు, డైరెక్టర్ సుజీత్ విఫలమయ్యాడు, “సాహో” తర్వాత కూడా అదే తప్పు మళ్లీ చేశారని ఆరోపణలు చేస్తున్నారు. “ఫ్యాన్స్‌ను టార్గెట్ చేసి మాత్రమే ఎలివేషన్స్ నడిపించారు. కథ ఎక్కడుందో ఎవరికీ అర్థం కాలేదు అంటూ కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ఓజీ ఫ్యాన్స్‌కు మాత్రం మాస్ ట్రీట్‌గా మారగా, సాధారణ ప్రేక్షకుల దృష్టిలో మాత్రం మిశ్రమ అభిప్రాయాలే కనిపిస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ వారం చివరికి సినిమా పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మూవీ అయితే రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు.