Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో అత్యంత స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ‘OG’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి పవన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచింది. ముఖ్యంగా పవన్‌ను పూర్తి స్థాయి స్టైలిష్ డాన్ అవతారంలో చూపించిన దర్శకుడు సుజీత్ ప్రశంసలు అందుకున్నారు. సినిమా విడుదల సమయంలోనే చిత్రబృందం ‘OG 2’ను అధికారికంగా ప్రకటించింది. దీంతో సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? కథ ఎలా ఉండబోతోంది? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయ బాధ్యతలతో బిజీ కావడం, మరోవైపు సుజీత్ కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్లడం వల్ల ‘OG 2’ త్వరలో ఉండకపోవచ్చనే ప్రచారం కూడా జరిగింది.
అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు చెందిన నిర్మాణ సంస్థ అధికారిక సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. “మాట ఇచ్చినట్లే ఆయన చేస్తారు. సమయం ఎప్పుడనేది ఆయనే చెబుతారు. సుజీత్ విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై చర్చిద్దాం” అంటూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీంతో ‘OG 2’ ప్రాజెక్ట్ ఆగిపోలేదని, సరైన సమయంలో పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే సుజీత్ హీరో నానితో కొత్త సినిమా ప్రకటించినప్పటికీ, ఆ సినిమా పూర్తయిన వెంటనే ‘OG 2’పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పవన్ కూడా తన రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా సినిమా కోసం సమయం కేటాయించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఇక ‘OG’ కథ విషయానికి వస్తే, జపాన్ నుంచి ముంబైకి వచ్చిన ఓజాస్ గంభీర అనే గ్యాంగ్‌స్టర్‌గా పవన్ కళ్యాణ్ కనిపించారు. ముంబై అండర్‌వరల్డ్‌ను శాసించే స్థాయికి ఎదిగిన అతను కొన్నేళ్ల పాటు అదృశ్యమై తిరిగి రావడం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా ముగింపులో జపాన్‌లో అతని గతం గురించి హింట్ ఇవ్వడం ద్వారా దర్శకుడు సీక్వెల్‌కు బలమైన లీడ్ వదిలారు.అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ‘OG 2’ సాధారణ సీక్వెల్ కాకుండా ప్రీక్వెల్‌గా తెరకెక్కే అవకాశాలు ఉన్నాయని గతంలో సుజీత్ సూచించారు. ‘OG’ ప్రపంచాన్ని విస్తరించేందుకు విడుదల చేసిన ప్రత్యేక పుస్తకంలోని కథాంశాలను ఆధారంగా తీసుకుని రెండో భాగాన్ని రూపొందించే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఆ కథ ప్రకారం, సుబాస్ చంద్రబోస్ జపాన్‌కు వెళ్లిన కాలానికి సంబంధించిన నేపథ్యాన్ని సినిమాలో చూపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. జపాన్‌లో జరిగిన సంఘటనలు, ఓజాస్ గంభీర తండ్రి కథ, అతని మరణానికి కారణమైన శత్రువులపై కుమారుడు చేసిన ప్రతీకారం ప్రధాన కథాంశంగా ఉండొచ్చని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.