Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల భుజం కండరాల సమస్య కారణంగా ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చికిత్స అనంతరం కోలుకుంటున్న పవన్ కళ్యాణ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ సందర్శనలో పాల్గొన్నారు. చంద్రబాబుతో కలిసి మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. అలాగే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవాతో కూడా చికిత్స వివరాలను తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్‌ను స్వయంగా కలిసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ధైర్యం చెప్పారు.
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై తాజా వివరాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రజల కోసం ఆలోచించే నాయకుడని, ప్రజల మధ్యకు వెళ్లినప్పుడు తన ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా సేవ చేయడానికి ముందుంటారని కొనియాడారు. ప్రజలను ఆకర్షించే ప్రత్యేకమైన నాయకత్వ లక్షణాలు పవన్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా కోలుకుంటున్నారని చంద్రబాబు తెలిపారు. ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే వైద్యులు పవన్ కళ్యాణ్‌కు కొన్ని కీలక సూచనలు చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. మూడు వారాల పాటు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోవాలని, అనంతరం ఫిజియోథెరపీ ప్రారంభించాలని వైద్యులు సూచించారని తెలిపారు. అలాగే చికిత్స అనంతరం ఆరు నెలల తర్వాత మరోసారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, తదుపరి చికిత్స లేదా కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు అత్యుత్తమ వైద్యం అందేలా ఆస్పత్రి వైద్యులతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలతో పాటు ప్రజాసేవలో ఎప్పుడూ చురుకుగా ఉండే పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, జనసేన కార్యకర్తలు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆకాంక్షిస్తున్నారు.