Pawan Kalyan | హనుమకొండకు చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అరుదైన జన్యుపరమైన వ్యాధి డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (DMD) *తో చిన్నప్పటి నుంచే పోరాడుతున్న నిరంజన్.. తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలన్న కోరికను ఇటీవల నెరవేర్చుకున్నాడు. అయితే అనారోగ్యం మరింత విషమించడంతో నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. వరంగల్–హనుమకొండ ప్రాంతానికి చెందిన పొనుగోటి రాము, మానస దంపతుల కుమారుడు నిరంజన్ చిన్న వయసులోనే డీఎండీ బారిన పడ్డాడు. ఈ వ్యాధి కారణంగా క్రమంగా కండరాలు బలహీనపడటంతో పాటు శరీర ఎదుగుదల ఆగిపోతుంది.
ప్రస్తుతం ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేదు. కాలక్రమేణా నిరంజన్ కిడ్నీలు కూడా దెబ్బతినడంతో పలు ఆస్పత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. గత మూడేళ్లుగా అతడు మంచానికే పరిమితమయ్యాడు. ఈ పరిస్థితుల్లో తన అభిమాన నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారి కలవాలన్న కోరికను కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ గత జూన్ 17న హనుమకొండలోని నిరంజన్ ఇంటికి స్వయంగా వెళ్లి అతడిని పరామర్శించారు. నిరంజన్‌తో ఆప్యాయంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్.. తిరుపతి ప్రసాదాన్ని అందించి, రూ.1 లక్ష ఆర్థిక సహాయం చేశారు.
అభిమాన హీరో స్వయంగా ఇంటికి రావడంతో నిరంజన్, అతని కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ఆ భేటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నిరంజన్ నేడు కన్నుమూశాడు. ఈ వార్త తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తన చివరి కోరికను పవన్ కళ్యాణ్ నెరవేర్చారని, ఆ జ్ఞాపకం నిరంజన్ కుటుంబానికి ఎప్పటికీ మిగిలిపోతుందని అభిమానులు భావోద్వేగంగా పేర్కొంటున్నారు.