Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై అభిమానులు, పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఆందోళనకు తెరపడింది. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్ బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సూచన మేరకు కొంతకాలం పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పవన్ కల్యాణ్ రెండు భుజాలకు సంబంధించిన ‘రొటేటర్ కఫ్’ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ కార్యక్రమాలు, ప్రజా పర్యటనలు, సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో ఈ సమస్య మరింత తీవ్రమైంది. దీంతో వైద్యుల సలహా మేరకు ఈ నెల 10న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేరారు.
పవన్ కల్యాణ్ కుడి భుజానికి నిపుణులైన వైద్యుల బృందం దాదాపు మూడున్నర గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించింది. అత్యంత క్లిష్టంగా సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనంతరం నాలుగు రోజుల పాటు ఆయనను వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించారు. ఆరోగ్యం మెరుగుపడటంతో బుధవారం వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. అయితే పూర్తిస్థాయిలో కోలుకోవడానికి మరికొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఫిజియోథెరపీతో పాటు వైద్యులు సూచించిన చికిత్సను తప్పనిసరిగా కొనసాగించాలని సూచించినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబైకి వెళ్లి ఆయనను పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా పవన్ కుటుంబ సభ్యులతో కూడా చంద్రబాబు మాట్లాడినట్లు సమాచారం. సీఎం పరామర్శకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పవన్ కల్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారన్న వార్త తెలిసిన వెంటనే జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేశారు. వైద్యులు సూచించిన విశ్రాంతి కారణంగా పవన్ కల్యాణ్ కొంతకాలం అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆయన కమిట్ అయిన సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో కూడా మార్పులు జరిగే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్న ప్రాజెక్టులను కొంతకాలం వాయిదా వేసే అవకాశం ఉందని సమాచారం.