సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అంశాలపై అగ్ర నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పందించారు. సోమవారం అమరావతిలో జరిగిన మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఈ వ్యవహారం గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లుందని వ్యాఖ్యానించారు. ఘటన జరిగిన రెండో రోజు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఉంటే ఈ వివాదం ఇంతదూరం వచ్చేది కాదన్నారు. అదే సమయంలో సినిమా అంటే అందరి భాగస్వామ్యమని, అల్లు అర్జున్ను ఒక్కడినే దోషిగా చూపించడం కరెక్ట్ కాదని చెప్పారు. తన వల్లే ఒకరు ప్రాణాలు కోల్పోయారనే బాధ అల్లు అర్జున్‌లో ఉందని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ‘వెంటనే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేది. అల్లు అర్జున్ కాకపోయినా ఆయన తరపున ఎవరో ఒకరు వెళ్లి రేవతి కుటుంబానికి భరోసా ఇచ్చి ఉండాల్సింది.
చట్టం అందరికీ సమానం. ఈ విషయంలో నేను పోలీసులను తప్పుపట్టను. వారు భద్రత గురించే ఆలోచిస్తారు. గతంలో చిరంజీవిగారు కూడా అభిమానులతో కలిసి థియేటర్ల్లలో సినిమాలు చూసేందుకు వెళ్లేవారు. కాకపోతే ఎవరూ గుర్తుపట్టకుండా ముసుగు వేసుకొని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు’ అని పవన్‌కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పాపికొండలు, విజయనగరం అటవీప్రాంతంలో మంచి లొకేషన్స్ ఉన్నాయని, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పిస్తే సినిమా షూటింగులకు బాగుంటుందని పవన్‌కల్యాణ్ తెలిపారు. ఇండస్ట్రీలో క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉండాలని, స్టోరీ టెల్లింగ్ స్కూల్స్ రావాలని, అప్పుడే నాణ్యమైన సినిమాలొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.