ప్రముఖ నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’తో అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ స్థాపించిన ‘పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ చేతులు కలిపిన విషయం విదితమే. ఈ రెండు సంస్థలు కలిసి చిత్రాలను నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలోనే ఈ సంస్థల మధ్య కథలకు సంబంధించిన చర్చలు జరిగాయి. తాజాగా మరోసారి పవన్‌కల్యాణ్, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిసి తాము భవిష్యత్‌లో చేయబోయే సినిమాల గురించి చర్చించారు.
ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ‘పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ స్పందిస్తూ.. ‘భోగి పండుగ సందర్భంగా.. కొత్త ఆరంభాల స్ఫూర్తిని సూచిస్తూ.. చేయబోయే ప్రాజెక్టులపై పవన్‌కల్యాణ్, పీపుల్ మీడియా అధినేత విశ్వప్రసాద్ కలిసి మరింత విస్తృతంగా చర్చించారు.’ అని పేర్కొన్నది. ఈ పోస్ట్‌కు నిర్మాత విశ్వప్రసాద్ బదులిస్తూ.. ‘కథలపై చర్చించే అవకాశం కల్పించిన పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. ప్రేక్షకులకు బలమైన, అర్థవంతమైన కంటెంట్‌ని అందించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. ‘పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’తో కలిసి పని చేయడం గౌరవంగా భావిస్తున్నాం. అద్భుతమైన ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాం’ అని స్పందించారు.