Pawan Kalyan | ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి మణికొండలోని నివాసంలో కన్నుమూశారు. పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేసిన ఆయనకి సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. . శివశక్తి దత్తా మృతిచెందడంతో వారి కుటుంబంతో పాటు అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శివశక్తి దత్తాకి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి శివశక్తి దత్తా విశేష సేవలు అందించారంటూ కొనియాడుతున్నారు.
అయితే శివ శక్తి దత్తా మరణ వార్త తెలుసుకున్న నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కళలు, సాహిత్యంపై ఎంతో అభిమానం కలిగినవారాయన. తెలుగు, సంస్కృత సాహిత్యాలపై పట్టున్న శ్రీ దత్తా గారు పలు చలనచిత్రాలకు గీత రచన చేశారు. పితృ వియోగంతో బాధపడుతున్న శ్రీ కీరవాణి గారికి, ఆయన సోదరులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని ట్వీట్ చేశారు.
ఇక శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు కాగా, ఆయన 1932 అక్టోబర్ 8వ తేదీన రాజమహేంద్రవరం సమీపంలోని కొవ్వూరులో జన్మించారు. శివశక్తి దత్తాకు ముగ్గురు సంతానం ఉన్నారు.. వారి పేర్లు కీరవాణి, కల్యాణి మాలిక్, శివ శ్రీ కంచి . ఇక శివ శక్తి దత్తాకు అన్న, అక్క, నలుగురు తమ్ముళ్లు ఉన్నారు.వారిలో ప్రముఖ సినీ రచయిత విజయంద్ర ప్రసాద్ శివ శక్తి తమ్ముడు. ఇక సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా ఉన్న ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, గాయని, సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న అవుతారు.తెలుగు సినిమాల్లో సంస్కృత ఆధారిత పాటలు రాయడంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు శివశక్తి దత్త . రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సై , ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు హనుమాన్ సినిమాకు కూడా ఆయన పాటలు రాశారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శివశక్తి దత్తా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.