Super Star Krishna | సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
‘చిత్రసీమలో సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత చేకూర్చిన కృష్ణ గారు తుది శ్వాస విడిచారనే విషయం ఎంతో ఆవేదన కలిగించింది. ఆయన కోలుకుంటారని ఆశించాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది. కృష్ణగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్నేహశీలి, మృదు స్వభావి అయిన ఆయన ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి మా కుటుంబంతో చక్కటి అనుబంధం ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఆయన సేవలు చిరస్మరణీయాలు. పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాజీవితంలో కూడా ఆయన తన ముద్ర వేశారు. సినిమా రంగం క్షేమాన్ని కాంక్షించే కృష్ణగారి మరణం తెలుగు చలనచిత్ర సీమకు తీరనిలోటు. ఆయన కుమారుడు మహేష్ బాబుకి, ఇతర కుటుంబ సభ్యులకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను’’ అని అన్నారు.
శ్రీ కృష్ణ గారు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/MuLsGyrzbO
— JanaSena Party (@JanaSenaParty) November 15, 2022