Pawan Kalyan on AP | ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీని, ఏపీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ భావోద్వేగ పూరితంగా మాట్లాడారు. సినీ పరిశ్రమ చాలా సెన్సిటివ్ అని అన్నారు. సినీ పరిశ్రమకు ఇబ్బందులు కలిగిస్తే తాట తీస్తా అని వైసీపీ నేతలను హెచ్చరించారు. తనపై కోపాన్ని సినీ పరిశ్రమపై చూపొద్దని కోరారు.
సినిమా ఇండస్ట్రీకి కులాలు, మతాలు ఉండవని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే మాడి మసై పోతారని తేల్చి చెప్పారు. ఎవరికైనా సినీ పరిశ్రమకు తేలిగ్గా టార్గెట్ అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా హీరోలు సాఫ్ట్ టార్గెట్‌గా మారారన్నారు. సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయని చెప్పారు. సినిమా రంగం జోలికి వస్తే మనమంతా కలవాలని పిలుపునిచ్చారు. సినిమా పరిశ్రమపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది జీవిస్తున్నారని అన్నారు.
ఏపీలో ఉన్నది వైసీపీ రిపబ్లిక్ కాదు ఇండియన్ రిపబ్లిక్ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సినిమా వాళ్ల గురించి కాదు.. పొలిటికల్ క్రైం గురించి మాట్లాడండని అని సూచించారు. మీకు మీకు రాజకీయ అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సినిమాల్లో విలువల గురించి మాట్లాడటం.. నిజ జీవితంలో ఆచరించడం సాధ్యం కాదని తెలిపారు. రాజమౌళి బాహుబలి తీస్తే మనందరికి గర్వకారణం అని చెప్పారు.
ఏపీలో సినిమా థియేటర్లు ఎందుకు తెరుచుకోవడం లేదని పవన్ కల్యాణ్ నిలదీశారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బుల్లేనందు వల్లే సినిమా టికెట్లు ప్రభుత్వమే విక్రయిస్తున్నదని వ్యాఖ్యానించారు. గిరిజనులకు పోడు భూములు ఎందుకు దక్కడం లేదో అడగండన్నారు. పవన్ సినిమాలను ఆపేస్తే భయపడిపోతారని వైసీపీ వాళ్లు అనుకుంటున్నారన్నారు. గూండాలకు భయపడితే బతకలేం అని పేర్కొన్నారు. తన పేరు చెప్పి చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు.
మాలో మాకు అభిప్రాయ బేధాలు ఉండొచ్చు కానీ అవి శత్రుత్వం కాదని పవన్ కల్యాణ్ అన్నారు. సినిమా వాళ్ల కష్టాల గురించి మోహన్ బాబు మాట్లాడాలని సూచించారు. చిత్ర పరిశ్రమ గురించి వైసీపీ నేతలకు మోహన్ బాబు చెప్పాలన్నారు. ఇప్పటికైనా తెలుగు చిత్ర పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని అన్నారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వానికి ఎలా బుద్ది చెప్పాలో తెలుసు అని స్పష్టం చేశారు.
అలాగే రెమ్యూనరేషన్ వివాదంపై పవన్ కల్యాణ్ ఘాటుగా మాట్లాడారు. తాను అడ్డగోలుగా సంపాదించడంలేదు.. వేల కోట్లు సంపాదించడం లేదు. డ్యాన్స్‌లు, ఫైట్లు.. కిందా మీదా పడి సంపాదిస్తున్నా.. సంపద సృష్టించకపోతే డబ్బులెలా వస్తాయి అని వ్యాఖ్యానించారు.
సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం బాధాకరం అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంత వరకు తేజ్ సినిమా ఫంక్షన్లకు రాలేదని చెప్పారు. తేజ్ రోడ్డు ప్రమాదంపై మీడియాలో లేనిపోని కథనాలు ప్రచారం చేశారన్నారు. సాయి తేజ్ ప్రమాదంపై కొందరు వివాదాస్పదంగా మాట్లాడారని పేర్కొన్నారు. తేజ్ ప్రమాదం కంటే మాట్లాడవల్సినవి చాలా ఉన్నాయన్నారు. తేజ్‌కు మీ అందరి ఆశీస్సులు కావాలని, అతడు మీ అందరి ఆనందాన్ని కోరుకుంటున్నారని చెప్పారు.
వైఎస్ వివేకా హత్యపై ఎందుకు కథనాలు రాయడం లేదని మీడియాను పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కోడి కత్తి కేసు గొడవ ఏమైందని అడగండన్నారు. పవర్ లేని వాడికి పవర్ స్టార్ ఎందుకు అని ఎద్దేవా చేశారన్నారు. తాను సీఎం అవుతానా.. కాదా.. అన్నది ముఖ్యం కాదన్నారు. సమస్యలపై పోరాటం చేయడమే ముఖ్యం అని చెప్పారు.