Pathaan Movie | ఇండియన్ బాద్షాగా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన షారుఖ్‌కు గత కొన్నేళ్లుగా హిట్టే కరువైంది. వరుస ఫ్లాపులతో ఒకానొక దశలో షారుఖ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయింది. దాంతో దెబ్బకు రెండేళ్ళు ఒక్క సినిమాను కూడా పట్టాలెక్కించలేదు. ఆ రెండేళ్ల గ్యాప్‌లో లెక్కలేనన్ని కథలు విన్నాడు. కానీ ఒక్కటికి సెట్ కాలేదు. చివరికి సిద్ధార్థ్ ఆనంద్ చెప్పిన ‘పఠాన్’ కథను ఒకే చేశాడు. దాదాపు మూడేళ్లుగా ఇదే ప్రాజెక్ట్‌పై పని చేశాడు. టైటిల్ పోస్టర్ దగ్గర నుండి ట్రైలర్ వరకు ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే వచ్చాయి. భేషరమ్ రంగ్ సాంగ్‌తో ఈ సినిమాపై ఎక్కడ లేని బజ్ క్రియేట్ అయింది. ఈ పాటపై పలు విమర్శలు వచ్చిన జనాలకు మాత్రం పఠాన్ సినిమా ఒకటుంది అని గుర్తుకు వచ్చేలా చేసింది.
ఇదంతా పక్కన పెడితే ఐదేళ్ల తర్వాత షారుఖ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా రానుండటంతో అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడం ఆలస్యం.. సినిమా టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. పీవీఆర్, సినీ పోలిస్, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లలో కేవలం నాలుగు రోజుల్లోనే దాదాపు 2 లక్షలు టిక్కెట్లు అమ్ముడవడం విశేషం. ఇప్పటివరకు హిందీలో ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఇన్ని టిక్కెట్లు తెగలేదు. రిలీజ్‌కు ముందే ఇలా సరికొత్త రికార్డులను పఠాన్ నెలకొల్పింది. అంతేకాకుండా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే ఈ సినిమాకు రూ.15 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. ఈ లెక్కన చూసుకుంటే మొదటి రోజు రూ.45 నుండి రూ.50 కోట్ల రేంజ్లో ఓపెనింగ్స్ రావడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.
ఇదే జరిగితే హిందీలో ఆ మార్కు టచ్ చేసిన మొదటి బాలీవుడ్ హీరోగా షారుఖ్ సరికొత్త రికార్డు నెలకొల్పుతాడు. వరుస డిజాస్టర్లు చూసిన షారుఖ్.. ఇలాంటి రికార్డుతో రీ ఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషం అనే చెప్పాలి. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో బ్యానర్లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా జనవరి 25న హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.