Dulquer Salmaan Kaantha | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘కాంత’. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. కింగ్డమ్ ఫేం భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే టీజర్‌ని విడుదల చేయగా.. దుల్కర్ రెట్రో స్టైల్లో అలరిస్తున్నాడు. అయితే రాఖీ పండుగ కానుకగా.. మూవీ నుంచి పసిమనసే(Pasi Manase) అనే మెలోడిని విడుదల చేశారు మేకర్స్. ప్రదీప్ కుమార్, ప్రియాంక ఎన్కే పాడిన ఈ పాటకు కృష్ఱకాంత్ సాహిత్యం అందించగా.. జాను చంతూర్ సంగీతం అందించారు. తెలుగుతో పాటు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.