Parvathy Thiruvothu | విషయం ఏదైనా కుండబద్దలు కొట్టడం.. పార్వతీ తిరువొత్తు సొంతం. దాపరికం లేకుండా మాట్లాడటం.. ఈ మలయాళ సొగసరి నైజం. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి సినిమాలపై విమర్శలు చేసినా, షూటింగ్‌ల సందర్భంగా హీరోయిన్ల ఇబ్బందుల గురించి చెప్పినా.. ఆమెకే చెల్లింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాల్యంలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. “చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలిసి రైల్వేస్టేషన్‌కు వెళ్లాను. అప్పుడే ఓ వ్యక్తి వచ్చి నా ఛాతీపై బలంగా కొట్టి వెళ్లిపోయాడు. ఆ ఘటన.. నన్ను చాలా కుంగదీసింది. బయటికి వెళ్లినప్పుడు నన్ను నేను ఎలా రక్షించుకోవాలో? మగాళ్ల చూపులు, చేతలను బట్టి ఎలా నడుచుకోవాలో.. అమ్మ చెప్పేది. ఓ తల్లి తన కూతురికి ఇలాంటి విషయాలను నేర్పించాల్సి రావడం.. చాలా దురదృష్టకరం” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఇక పెరిగి పెద్దయ్యే దశలోనూ పలుమార్లు లైంగిక వేధింపులకు గురైనట్లు వెల్లడించింది.
కొందరు మగవాళ్ల అసభ్యకరమైన సైగలు, మాటలతో చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించింది. “స్కూల్లో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని ఇష్టపడ్డా! ప్రాణంగా ప్రేమించా. కానీ, అతను కూడా ఓరోజు తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. ప్రేమించినంత మాత్రాన.. అలాంటి పనులకు ఒప్పుకోవాలా?” అని ప్రశ్నించింది. ఇక సెట్లోనూ తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించీ పంచుకున్నది. తమిళ స్టార్ ధనుష్ హీరోగా 2013లో వచ్చిన ‘మరియన్’ చిత్రంలో పార్వతి నటించింది. ఈ షూటింగ్ సందర్భంగా తాను తీవ్ర ఇబ్బందికి గురైనట్లు వెల్లడించింది. “మరియన్ షూటింగ్ సమయంలో ధనుష్‌తో ఓ రొమాన్స్ సీన్ తీస్తున్నారు. అందులోనూ వానలో షూటింగ్. దాంతో, నా ఒళ్లంతా తడిచేలా చేశారు. అయితే, ఆ సమయంలో నాకు పీరియడ్స్. ఆ విషయం డైరెక్షన్ బృందంతో చెప్పినా వినిపించుకోలేదు” అంటూ వాపోయింది. దాంతో తనకు విసుగొచ్చి.. అక్కడివారిపై అరిచి స్పాట్‌నుంచి వెళ్లిపోయానని చెప్పింది.
ఆడవాళ్లపై లైంగిక వేధింపులు, షూటింగ్లో వారు ఎదర్కొనే కష్టాలపై పార్వతి చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మలయాళ చిత్రసీమకు చెందిన పార్వతీ తిరువొత్తు.. దక్షిణాదిలో విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్నది. 20 ఏళ్ల సినిమా కెరీర్లో అనేక వినూత్నమైన పాత్రలు పోషించింది. 2006లో వచ్చిన ‘ఔట్ ఆఫ్ సిలబస్’ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బెంగళూరు డేస్, చార్లీ, టేకాఫ్ తదితర హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నది. విక్రమ్ ప్రధానపాత్రలో వచ్చిన ‘తంగలాన్’లో నటనకు ప్రశంసలు అందుకున్నది. పార్వతి నటించిన ఐ నోబడీ, ప్రథమ ద్రిష్ట్య కుటక్కర్ సినిమాలు త్వరలోనే
విడుదల కానున్నాయి.