జాబు సాటిశ్వాక్షన్ కంటే జేబు సాటిశ్వాక్షన్కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు చాలామంది. కానీ.. ప్రముఖ నటుడు పరేష్ రావెల్ అందుకు భిన్నం. పాత్ర నచ్చకపోతే అది ఎంత పెద్ద సినిమా అయినా.. నిర్ధాక్షిణ్యంగా ‘నో’ చెప్పేస్తారాయన. రీసెంట్గా ఓ సినిమా విషయంలో అదే జరిగింది. వివరాల్లోకెళ్తే.. అజయ్ దేవగన్ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ బాలీవుడ్లో ఎంత విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫ్రాంచైజీ నుంచి ‘దృశ్యం 3’ రాబోతున్నది.
ఈ సినిమాలో ఓ కీలక పాత్రకు పరేష్ రావెల్ని అడిగారు. కానీ ఆయన కథ, పాత్ర విని సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పరేష్రావెల్ మాట్లాడుతూ ‘ అజయ్ దేవగన్ ‘దృశ్యం’ ఫ్రాంచైజీ నిజంగా నాకు చాలా ఇష్టం. అందులో భాగం అయ్యే అవకాశం నాకు వచ్చింది.
‘దృశ్యం 3’లో నటించమని మేకర్స్ అడిగారు. కానీ.. ‘నో’ చెప్పాల్సొచ్చింది. కారణం పాత్ర నచ్చకపోవడమే. అందులో నటనకు ఆస్కారం లేదు. పాత్ర వినగానే నటుడికి ఓ మజా రావాలి. ఆ మజా ఆ పాత్రలో లేదు. స్క్రిప్ట్ బావుంది. ప్యాకేజీ కూడా బావుంది. పాత్ర బాలేదు. డబ్బుకోసం రాజీపడలేను. అందుకే తిరస్కరించా.’ అని సింపుల్గా చెప్పేశారు పరేష్ రావెల్.