Paradha Trailer | అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం పరదా ఆగస్టు 22న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీజర్‌తో ఆసక్తి రేపిన చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేసింది. ట్రైలర్ చూస్తేనే కథలోని గంభీరత, సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చిత్రం ఓ గ్రామంలో పాత సంప్రదాయాల పేరుతో ఉన్న దురాచారాల నేపథ్యంలో సాగుతుంది. ఆ గ్రామంలో ఆడపిల్లలు బయటకు మొహం చూపించకుండా, పరదా కట్టుకొని జీవించాల్సిన పరిస్థితి. అటువంటి సమాజంలో ఎదిగిన సుబ్బు పాత్రలో అనుపమ కనబడతారు. ఆ గ్రామంలో ఇంకెన్ని దురాచారాలు ఉన్నాయి? వాటిని సుబ్బు ఎలా ఎదుర్కొంది అనేది చిత్ర కథగా తెలుస్తుంది.
ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునే ఎమోషన్‌తో పాటు ఇంట్రెస్టింగ్ కథతో ఉండడం సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఆచారాల ముసుగులో నలిగిపోతున్న మహిళ తన గ్రామం నుంచి తప్పించుకోవడం, ఆమెకు మరో ఇద్దరు మహిళలు తోడు కావడం.. వారి ద్వారా తన నిజమైన జీవితాన్నిఎలా కనుగొంది అనేది చిత్రంలో ఆసక్తిగా చూపించనున్నట్టు తెలుస్తుంది. ఇలాంటి గుడ్ ఫీల్ కాన్సెప్టులని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి కథకి అనుపమ పరమేశ్వరన్ తోడు కావడంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఆగస్టు 22న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.
ఈ చిత్రానికి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమతో పాటు సంగీత , ఇతర మహిళా పాత్రలు కథలో కీలకంగా ఉంటాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. దర్శకుడు వీటిని బలంగా డిజైన్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇది సమాజానికి సందేశాన్ని ఇచ్చే చిత్రంగా నిలవనుంది. ఆసక్తికరమైన అంశం ఏమంటే, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కూడా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే, ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు, అది సస్పెన్స్‌గా ఉంచారు. గోపీ సుందర్ అందించిన నేపథ్య సంగీతం ట్రైలర్‌కు మంచి బలాన్నిచ్చింది. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. కథ, మేకింగ్ పరంగా సినిమాకు మంచి కంటెంట్ ఉంది.ఇప్పటికే చిత్రబృందం ప్రమోషన్స్ ప్రారంభించింది. పబ్లిసిటీపై మరింత ఫోకస్ పెడితే, ఈ సినిమాను థియేటర్లకు మరింత మంది ప్రేక్షకులు ఆకర్షించే అవకాశం ఉంది.